Begin typing your search above and press return to search.

షాక్ మీద షాక్ ఇస్తున్న బిగ్ బాస్: చరణ్ తర్వాతి బలైన చైత్ర

బిగ్‌బాస్ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో పదో సీజన్ మొదటి వారంలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Sept 2026 9:00 AM IST
షాక్ మీద షాక్ ఇస్తున్న బిగ్ బాస్: చరణ్ తర్వాతి బలైన చైత్ర
X

బిగ్‌బాస్ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో పదో సీజన్ మొదటి వారంలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వీకెండ్‌లో ఎలిమినేషన్ రద్దు చేయడమో లేదా ఒకరిని పంపడమో చూసిన ప్రేక్షకులకు షాక్ ఇస్తూ, ఏకంగా తొలివారంలోనే 'డబుల్ ఎలిమినేషన్' తెరపైకి వచ్చింది. 16 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఇప్పటికే మిడ్-వీక్ ఎలిమినేషన్ ద్వారా కామనర్ చరణ్ మహాదేవ్ ఇంటి బాట పట్టగా, తాజాగా టీవీ సీరియల్ నటి చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయింది.

షోలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన చైత్ర ఎలిమినేషన్ సమంజసమే అనిపించినా, చరణ్‌కి మాత్రం మరో అవకాశం దక్కాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, హౌస్‌లో ఇప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపించని వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు:

త్రిగుణ్ వెనకాల తిరుగుతూ కాలక్షేపం చేయడం తప్ప కృష్ణుడు గేమ్‌లో ఎలాంటి చలనం లేదు. నిన్నటి టాస్కులో త్రిగుణ్, ముఖేష్‌లు గెలిచి ఉండకపోతే ఆయన పరిస్థితి డేంజర్ జోన్‌లో పడేదే. పక్కాగా ఎలిమినేషన్ ముప్పులో ఉండాల్సిన మొదటి వ్యక్తి ఆయనే.

దేబ్జానీ భాషే సమస్యగా మారి ఏమాత్రం ఎఫర్ట్ పెట్టలేక పోతుండగా, యూట్యూబర్ సుధీర్ సైతం పూర్తిగా డల్ అయిపోయి ఎలాంటి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాడు. టికెట్ గెలుచుకుని హౌస్‌లోకి అడుగుపెట్టిన ఝాన్సీ, గేమ్ పరంగా చూస్తే నిరాశ పరుస్తోంది. ఏ టాస్కులోనూ యాక్టివ్‌గా కనిపించక ప్రమాదపు అంచుల్లోనే నిలిచింది.

ఇప్పుడు అందరి కళ్లూ వీకెండ్ ఎపిసోడ్‌పైనే ఉన్నాయి. నాగార్జున ఈసారి రంగంలోకి దిగి సెలబ్రిటీల గ్రూపిజంపై గట్టిగా మాట్లాడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిగుణ్ తీరుపై, కామనర్లను చిన్న చూపు చూస్తూ సెలబ్రిటీలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై నాగ్‌ తీవ్రంగా స్పందించాల్సిన సమయం ఇది. అటు ఏమీ చేయకుండా కూర్చుంటున్న ఝాన్సీకి క్లాస్ పీకడంతో పాటు, సెలబ్రిటీలంతా ఏకమై కార్నర్ చేస్తున్నా ఒంటరిగా పోరాడుతున్న రోహిత్‌కు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చేలా మెచ్చుకోవాల్సిన బాధ్యత హోస్ట్‌పై ఉంది.