Begin typing your search above and press return to search.

16 ఏళ్లు.. బాబోయ్‌ ఇక చాలు బిగ్‌బాస్‌

మొత్తానికి హిందీ బిగ్‌బాస్‌ కు వచ్చే సీజన్ నుంచి కొత్త హోస్ట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది బాలీవుడ్‌ వర్గాల వారి టాక్‌.

By:  Ramesh Palla   |   7 Oct 2025 11:01 PM IST
16 ఏళ్లు.. బాబోయ్‌ ఇక చాలు బిగ్‌బాస్‌
X

ఇండియాలో బిగ్‌బాస్‌ కి మంచి ఆధరణ ఉంది. హిందీలో దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లి తెర ప్రేక్షకులను, ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్‌ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు సల్మాన్‌ ఖాన్‌ కారణంగా బిగ్‌బాస్‌ కి మంచి ఆధరణ పెరిగింది. ఆయన హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు బిగ్‌బాస్‌ను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. బిగ్‌బాస్‌ హోస్ట్‌ అంటే సల్మాన్‌ ఖాన్‌ మాదిరిగా ఉండాలి అంటూ ఇతర భాషల బిగ్‌బాస్‌ షో హోస్ట్‌లు సైతం చూసి నేర్చుకునే విధంగా సల్మాన్‌ ఖాన్‌ వ్యవహరించారు. 16 సీజన్‌లకు సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ చేశాడు. మొదటి మూడు సీజన్‌లు మినహా మొత్తం 16 సీజన్‌ల బిగ్‌బాస్‌ షో కి సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు, ఇప్పటికీ వ్యవహరిస్తూనే ఉన్న విషయం తెల్సిందే.

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కొత్త హీరో రానున్నాడా..?

గత రెండు మూడు సీజన్‌లుగా బిగ్‌బాస్ ప్రేక్షకులు, మీడియా వర్గాల వారు, ఒక వర్గం ఇండస్ట్రీ వారు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సల్మాన్‌ ఖాన్‌ విఫలం అవుతున్నాడు, ఆయన పక్షపాతం చూపిస్తూ కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, బిగ్‌బాస్‌లోనూ నెపొటిజంను పెంచి పోషిస్తున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. హిందీ బిగ్‌బాస్‌ షో ఎవరి వల్ల అయితే టాప్ రేటింగ్‌కు వెళ్లిందే, ఆయన వల్లే ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది, అంతే కాకుండా షో కి ఏమాత్రం రేటింగ్‌ రావడం లేదు. అందుకే బిగ్‌ బాస్‌ షో నుంచి సల్మాన్‌ ఖాన్‌ ను నిర్వాహకులు తప్పించాలి అనుకుంటున్నారు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదే సమయంలో సల్మాన్‌ సైతం బిగ్‌బాస్‌ కు బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సల్మాన్‌ ఖాన్‌ విషయంలో విమర్శలు

మొత్తానికి హిందీ బిగ్‌బాస్‌ కు వచ్చే సీజన్ నుంచి కొత్త హోస్ట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది బాలీవుడ్‌ వర్గాల వారి టాక్‌. ఇప్పటికే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కొత్త హోస్ట్‌ విషయంలో చర్చలు జరుపుతున్నారని, ఒక బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోను హోస్ట్‌గా తీసుకు వస్తే బాగుంటుందని నిర్వాహకుల్లోనే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అంతే కాకుండా ఆ హీరో వద్ద అనధికారికంగా ఈ ప్రపోజల్‌ పెట్టడం, ఆయన ఆసక్తి చూపించడం జరిగిందట. అంతే కాకుండా సల్మాన్‌ ఖాన్‌కు ఇచ్చే పారితోషికంలో దాదాపుగా సగం మాత్రమే ఆయనకు పారితోషికంగా ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు షో హోస్ట్‌ విషయంలో అనేక పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లు మరింతగా ముదరడం, తీవ్ర విమర్శలకు దారి తీయడం వంటివి చూస్తూ ఉంటే షో హోస్ట్‌ మారడం ఖాయం అనే అభిప్రాయంను బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు సైతం విశ్లేషిస్తున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 19 పై ట్రోల్స్‌

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 19 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఫేవరేటిజం చూపిస్తున్నాడని క్లీయర్‌గా అర్థం అవుతుంది అంటూ ఇప్పటికే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ విషయమై సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సల్మాన్‌ ఖాన్‌ మాత్రం గతంలో మాదిరిగానే తన హోస్టింగ్‌ ఉంది, ఎవరి విషయంలోనూ ఫేవరేటిజం లేదని, అంతే కాకుండా షో విషయంలో గతంలో ఉన్నట్లుగానే తాను చిత్తశుద్దితో ఉన్నట్లుగా సన్నిహితులతో చెప్పించే ప్రయత్నం సల్మాన్ ఖాన్‌ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బిగ్‌బాస్‌ హిందీ ఒకప్పుడు ఓ రేంజ్‌ లో రేటింగ్‌ దక్కించుకునేది, కానీ ఇప్పుడు మాత్రం షో కి ప్రేక్షకుల ఆధరణ తగ్గడంతో అన్ని విషయాల్లోనూ మార్పులు అవసరం అని ప్రేక్షకులతో పాటు, నిర్వాహకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.