బిగ్ బాస్ షోను స్క్రిప్టు చేయలేరు
'బిగ్ బాస్' రెండు దశాబ్ధాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైన మాస్ షో. దీనికి దేశవ్యాప్తంగా మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది.
By: Sivaji Kontham | 11 Sept 2025 9:30 AM IST'బిగ్ బాస్' రెండు దశాబ్ధాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైన మాస్ షో. దీనికి దేశవ్యాప్తంగా మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది. పాశ్చాత్యాన్ని విపరీతంగా ఇష్టపడే భారతీయులందరికీ ఇది అద్భుతమైన షో. బిగ్ బాస్ వేదికగా ఇంటి సభ్యుల్లో తమను తాము చూసుకుంటూ ఫలవరించేవాళ్లు ఉన్నారు. అందుకే బిగ్ బాస్ కి ఆదరణ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇది పిచ్చి ప్రకోపం అని సాంప్రదాయవాదులు విమర్శిస్తే, ఇది మనిషిలోని రియాలిటీని బయటపెట్టే అరుదైన వేదిక అని చెప్పేవాళ్లకు కొదవేమీ లేదు. టెలివిజన్ రంగంలో అత్యంత చర్చనీయాంశమైన షోలలో ఒకటిగా నిలిచింది ఇది.
హిందీ బిగ్ బాస్ కి 2010 నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 15ఏళ్లయింది. సీజన్ 19 ప్రస్తుతం ప్రసారం అవుతుండగా బిగ్ బాస్ కర్తలు అయిన స్క్రీన్ ఎండేమోల్ ఇండియా సీఈవో రిషి నేగి ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అసలు బిగ్ బాస్ స్క్రిప్టు ప్రకారం రన్ అవుతుందా? ఇంటి లోపలి వ్యవహారాల వెనక ఎవరైనా ఉంటారా? సల్మాన్ కి హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లాంటి ఆసక్తికర విషయాలను ఆయన మాట్లాడారు.
గత రెండేళ్లుగా సల్మాన్ ఖాన్ కి హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. అందువల్ల షోలో అతడికి భద్రతను చాలా పెంచామని రిషి నేగి అన్నారు. సల్మాన్ ఖాన్ చిత్రీకరణలో ఉన్నప్పుడు షోలో ప్రత్యక్ష ప్రేక్షకులను చేర్చుకోము. అలాగే, షోకి వచ్చే వ్యక్తుల గురించి చాలా కఠినమైన ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. మేం నియమించుకునే ప్రతి ఒక్కరి నేపథ్యాన్ని బాగా తనిఖీలు చేస్తాం... అని తెలిపారు. ప్రొడక్షన్ కూడా భారీ స్థాయిలో నడుస్తుంది. దాదాపు 600 మంది మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. షో కోసం 24X7 పని చేస్తాము. పని ప్రదేశంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉంది. కంటెంట్ భద్రత .. పని చేసే చోట దేనికీ రాజీపడమని అన్నారు.
బిగ్ బాస్ 2006లో భారతదేశానికి రావడానికి కారణం ఎండెమోల్ సంస్థ. అంచెలంచెలుగా ఇది దేశంలోని అతిపెద్ద రియాలిటీ షో బ్రాండ్‌గా స్థిరపడింది. దేశవ్యాప్తంగా పలు భాషలకు విస్తరించి అన్నిచోట్లా గొప్ప ఆదరణను అందుకుంటోంది. టాలీవుడ్ లో నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా ఉన్నారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. మలయాళం, కన్నడలోను షో పెద్ద హిట్టయింది.
బిగ్ బాస్ షోను స్క్రిప్టు చేయలేరు:
ఇక ఈ షోను ఎప్పటికీ స్క్రిప్టు ప్రకారం నడిపించడం కుదరదని కూడా ఎండిమోల్ అధినేత రిషి నేగి అన్నారు. పోటీదారుల ప్రవర్తనపై ఆధారపడి ప్రతిదీ అభివృద్ధి చేయాలి. ఇలాంటి షోను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది.హౌస్ లోపల ప్రతి కదలికను 200 కంటే ఎక్కువ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఎడిటర్లు, నిర్మాణ బృందాలు కథాంశాలను రూపొందించడానికి రియల్ టైమ్ లో పని చేయాలి. అందుకే ఈ షోను ఎప్పటికీ స్క్రిప్ట్ చేయలేము. ఎందుకంటే కంటెంట్ ప్రవాహం పోటీదారులు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కథ వారి ప్రతి కదలిక ఆధారంగా మారుతుంది. కొన్నిసార్లు మనం ఏదైనా ప్లాన్ చేసినా కానీ ఇంట్లో ఇంకేదో పెద్ద విషయం జరుగుతుంది. మనం మన ప్లాన్‌ను రద్దు చేసి పరిస్థితి చుట్టూ కొత్తదాన్ని రూపొందించుకోవాలి అని వివరించారు.
అర్షద్ వార్షీ, శిల్పా శెట్టి, అమితాబ్ తర్వాత సల్మాన్ సుదీర్ఘ కాలం ఈ షో కోసం హోస్ట్ గా విజయవంతంగా పని చేసారు. షో కాస్టింగ్ విషయంలో తుది నిర్ణయాలు ఎల్లప్పుడూ నిర్మాతలే తీసుకుంటారని రిషి వెల్లడించారు.
