Begin typing your search above and press return to search.

5 కోట్ల మోసం కేసులో పోలీసుల‌కు న‌టుడు స‌వాల్

ఈ మోసం విలువ 5 కోట్లు. ఫిర్యాదు చేసిన ఒక కొనుగోలుదారుడు, ఒకే ఆస్తిని ఒకరి కంటే ఎక్కువ మందికి విక్రయించారని తెలుసుకున్న తర్వాత తాను తీవ్ర‌ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాన‌ని పేర్కొన్నాడు.

By:  Sivaji Kontham   |   5 Jan 2026 11:07 PM IST
5 కోట్ల మోసం కేసులో పోలీసుల‌కు న‌టుడు స‌వాల్
X

ప్ర‌ముఖ నటుడు ఒకే దుకాణాన్ని న‌కిలీ పత్రాలు సృష్టించి ప‌లువురికి అమ్మాడు. అలా 5 కోట్ల మేర మోసం చేసాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయ్యాడు. పెళ్ల‌యిన 11వ రోజునే అత‌డు అరెస్ట్ అవ్వ‌డంతో కొత్త పెళ్లి కూతురు చాలా కంగారు ప‌డింది. హ‌నీమ‌న్ కోసం విమానం ఎక్కేందుకు వెళ్లిన‌ప్పుడు కాపు కాసిన పోలీసులు అతడిని విమానాశ్ర‌యంలో అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం అతడిని, అత‌డి కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు. అత‌డి సోద‌రిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ఇంత‌కీ ఎవ‌రు ఆ న‌టుడు? అంటే.. బిగ్ బాస్ మరాఠీ సీజన్ 3లో సుపరిచితమైన ముఖం జయ్ దుధానే. రూ. 5 కోట్ల విలువైన మోసం కేసులో అత‌డిని అరెస్ట్ చేసారు. ఇటీవలే వివాహం చేసుకున్న జయ్ దుధానేకు అత‌డి భార్యకు ఇది పెద్ద షాక్. జయ్ తన భార్యతో హనీమూన్‌కు వెళ్తున్నప్పుడు ముంబై విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసులు అనుమానించారు. దీంతో విమానాశ్రయంలో కాపుకాసి అరెస్టు చేశారు.

నకిలీ పత్రాలను ఉపయోగించి పలువురిని మోసం చేశారని జ‌య్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ మోసం విలువ 5 కోట్లు. ఫిర్యాదు చేసిన ఒక కొనుగోలుదారుడు, ఒకే ఆస్తిని ఒకరి కంటే ఎక్కువ మందికి విక్రయించారని తెలుసుకున్న తర్వాత తాను తీవ్ర‌ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాన‌ని పేర్కొన్నాడు.

అయితే జ‌య్ దుధాని ఇవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు అని, వీటిని నిరూపించ‌గ‌ల‌రా అని స‌వాల్ విసిరారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని జ‌య్ దుధానే చెప్పాడు. నేను మా నాన్న బాధ్యత తీసుకున్నాను.. దానివల్లే అంతా నాకు వ్యతిరేకంగా మారుతోందని భావిస్తున్నాను! అని జయ్ అన్నాడు.

నా కుటుంబంలో అంద‌రిపైనా పోలీసులు కేసులు పెట్టారు. చివ‌రికి నా తాతయ్య, అమ్మమ్మలను కూడా వదల్లేదు.. అని చెప్పాడు. మోసం చేసాన‌న‌డానికి ఆధారాలేవి? అని కూడా అత‌డు ప్ర‌శ్నించాడు. వాటిని అబద్ధమని కొట్టిపారేశాడు. దుకాణం అమ్మిన తర్వాత ఈ పుకార్లు ఎవరు వ్యాపింపజేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఏమైనా నిజం ఉంటే, దాన్ని నిరూపించండి..అని ప్ర‌తిస‌వాల్ విసిరాడు.

అరెస్ట్ జ‌రిగాక ముఖం దాచుకున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పైనా జై స్పందించాడు. ``దాచ‌డానికి ఏమీ లేదు. నా ముఖాన్ని దాచడానికి ప్రయత్నించలేదు.. త్వరలోనే అంతా బయటపడుతుంది. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. జీవితంలో మనకు చాలా కష్టాలు ఎదురవుతాయి.. వాటిని మనం ఎదుర్కోవలసి ఉంటుంది.. కానీ దాని కోసం ధైర్యం కూడా అవసరం.. ఆ ధైర్యం నాకు ఉంది`` అని అన్నాడు.

నేను నా భార్య హ‌నీమూన్‌కి వెళుతున్నాం. మాతో పాటు నా అన్న వ‌దిన కూడా ఉన్నారు. మేం నలుగురం కలిసి విదేశాలకు ప్రయాణిస్తున్నాము. నా పేరు మీద అరెస్ట్ వారెంట్ ఉందని కూడా నాకు తెలియదు. విమానాశ్రయంలో నేను దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు! అని అన్నాడు. ఈ కేసులో జయ్ దుధానేతో పాటు అత‌డి అమ్మమ్మ, తాత, తల్లి, సోదరిని కూడా విచారిస్తున్నారు. అధికారులు ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారా లేదా అనేది ప‌రిశీలిస్తున్నారు.

జయ్ దుధానే బిగ్ బాస్ తో ఫేమ‌స్ అయ్యాడు. పెళ్ల‌యిన 11వ రోజున అరెస్ట్ అవ్వ‌డం మరాఠీ వినోద పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇవ‌న్నీ కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని అత‌డు కొట్టి పారేస్తున్నా, ఆధారాల‌తోనే అరెస్ట్ చేసామ‌ని పోలీసులు చెబుతున్నారు. ద‌ర్యాప్తు వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.