Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌లోకి 'పుష్ప 2' కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ?

లేడీ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ ఫేమ్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. సోమవారం (ఆగస్టు 17) ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

By:  Madhu Reddy   |   17 Aug 2026 9:00 PM IST
పాలిటిక్స్‌లోకి పుష్ప 2 కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ?
X

లేడీ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ ఫేమ్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. సోమవారం (ఆగస్టు 17) ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో శ్రష్టి వర్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు రామచందర్ రావు పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

'ఢీ' షో నుంచి బిగ్‌బాస్ వరకు ప్రయాణం:

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో జన్మించిన శ్రష్టి వర్మ, ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద కొంతకాలం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు. ఇక ఆ తర్వాత స్వతంత్ర కొరియోగ్రాఫర్‌గా మారి పలు సినిమాలకు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ అందించారు. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

‘పుష్ప 2’ సక్సెస్‌తో పాపులారిటీ:

ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ, స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రంలో కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అందులోని సూపర్ హిట్ పాట 'సూసేకి'కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి అపారమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో కొరియోగ్రాఫర్‌గా ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ లభించింది.

రాజకీయాల్లోకి కొత్త ప్రయాణం:

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రష్టి వర్మ, ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఇక పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రష్టి వర్మతో పాటు మరికొందరు ముఖ్యాంశాల ప్రతినిధులు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.

సినిమా పరిశ్రమలో తనదైన టాలెంట్‌తో డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ, ఇప్పుడు బీజేపీలో చేరి రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇక కళారంగంలో సక్సెస్ అయినట్లే, ప్రజాసేవలో కూడా ఆమె రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.