బిగ్‌బాస్9 : వైల్డ్ ఎంట్రీ ఇచ్చే వారు వీళ్లేనా?
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మెల్ల మెల్లగా ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంటూ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ సాగుతోంది.
By: Ramesh Palla | 22 Sept 2025 8:00 PM ISTతెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మెల్ల మెల్లగా ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంటూ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ సాగుతోంది. ఇప్పటి వరకు రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. సీజన్ ఆరంభంలోనే మూడు లేదా నాలుగు వారాల తర్వాత ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తం అయింది. షో నిర్వాహకులు సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అన్నట్లుగా ప్రకటించారు. దసరా సందర్భంగా భారీ రీలాంచ్ కార్యక్రమంను నిర్వహించి ముగ్గురు లేదా అంతకు మించి కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించే వారు ఖరారు అయ్యారు, అతి త్వరలోనే వారు హౌస్‌లోకి అడుగు పెట్టేందుకు గాను అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టబోతున్నారు అంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయం
మూడు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత నాల్గవ వారం నుంచి కొత్త వారితో ఇల్లు కొత్తగా మారబోతుంది. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మూడో వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని వార్తలు వస్తున్నాయి. డ్యూయెల్ ఎలిమినేషన్ ఉంటేనే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది. అందుకే డబుల్ ఎలిమినేషన్‌కి షో నిర్వాహకులు ఇప్పటికే ప్లాన్ చేశారని, కంటెస్టెంట్స్ లో ఎవరైతే ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారో వారిలో తక్కువ ఓట్లు పడ్డ ఇద్దరిని ఎంపిక చేసి ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సామాన్యుల్లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానుండగా, సెలబ్రిటీల్లోనూ ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా బలంగా రివ్యూవర్స్ చెబుతున్నారు, వారు ఎవరు అనేది ముందు ముందు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎలిమినేషన్‌కి నామినేషన్స్ పక్రియ ప్రారంభం అయింది.
టీవీ నటి సుహాసిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగు పెట్టబోతున్న వారిలో ముఖ్యంగా సీరియల్ నటి సుహాసిని ఒకరు అని తెలుస్తోంది. ఈమె బుల్లి తెరపై సుదీర్ఘమైన అనుభవం ఉన్న నటి. సినిమాల్లోనూ ఈమె నటించిన విషయం తెల్సిందే. సెలబ్రిటీ హోదాలో ఈమెకు ఎంట్రీ దక్కిందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఎంట్రీ గురించి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్ మా టీంలో సుదీర్ఘ కాలంగా షో లు, సీరియల్స్ చేస్తున్న ఈమె ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని చూస్తోంది. ఈమెకు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంది. కనుక మంచి ఓట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా చాలా పాపులర్ అయిన రమ్య సైతం ఈ సీజన్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. రమ్య ఇప్పటికే వైల్డ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుందట.
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకి బిగ్‌బాస్ 9 లో చోటు
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం కారణంగా రమ్యకు మంచి గుర్తింపు దక్కింది. అంతే కాకుండా హీరోయిన్స్‌ను మించి అందంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే రమ్య ను బిగ్‌బాస్ టీం ఆహ్వానించింది. ఆమె హౌస్‌కి గ్లామర్‌ను అద్దడంతో పాటు, ఖచ్చితంగా మంచి కంటెంట్‌ను ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సీరియల్ నటుడు శివ కుమార్ సైతం ఈ షో లో వైల్డ్ ఎంట్రీ కోసం రెడీ అయ్యాడు. ఈయన నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా షో కి అదనపు ఆకర్షణగా నిలుస్తాడు.
ఈ ముగ్గురు కాకుండా దివ్వెల మాధురికి సైతం బిగ్‌బాస్‌లో చాన్స్ దక్కిందట. ఈ మధ్య కాలంలో రాజకీయంగా ప్రముఖంగా వినిపిస్తున్న దివ్వెల మాధురి బిగ్‌బాస్‌కి వెళ్తే ఖచ్చితంగా చాలా పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. దివ్వెల మాధురి ఇప్పటి వరకు బిగ్‌బాస్ విషయాన్ని ఎక్కడా ప్రస్థావించలేదు. కనుక ఆమె బిగ్‌బాస్ కి వెళ్లే వరకు క్లారిటీ లేదు. ఆమె విషయంలో ఎంట్రీ ఇచ్చే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మొత్తానికి ఈ కొత్త వారితో బిగ్‌బాస్ హౌస్ మరింత వినోదాన్ని పంచుతుందా అనేది చూడాలి.
