జీవితం ఒక సైకిల్.. నాగ్ తో మధుర జ్ఞాపకాలు పంచుకున్న మహేష్ బాబు వదిన!
అటు నాగార్జునను చూడగానే ఉబ్బితబ్బిబయిపోయిన శిల్పా శిరోద్కర్ కూడా నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ.." జీవితం అనేది ఒక సైకిల్ లాంటిది.
By: Madhu Reddy | 21 Oct 2025 1:00 AM ISTజీవితం ఒక చక్రం లాంటిది. ఒకే చోటే ఆగిపోదు. ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుతుంది అనడంలో సందేహం లేదు. ఇక మన జీవితంలో జరిగిన సంఘటనలు.. అప్పుడప్పుడు పునరావృతం అయితే ఇదే ఆలోచన మనకు కూడా వస్తుంది. సరిగ్గా ఇప్పుడు సెలబ్రిటీల విషయంలో కూడా అదే జరుగుతోంది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన విషయం తెలిసిందే. దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ 19వ తేదీన బిగ్ బాస్ హౌస్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. హౌస్ మేట్స్ అందరికీ కొత్త బట్టలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు హోస్ట్ నాగార్జున.
ఇకపోతే వీకెండ్స్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ప్రమోషన్స్ కోసం వచ్చి సందడి చేస్తాయి అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే తాజాగా జటాధర మూవీ బృందం కూడా వచ్చి సందడి చేసింది.. ఇందులో సుధీర్ బాబుతో పాటు సోనాక్షి సిన్హా, ప్రముఖ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన.. హీరోయిన్ శిల్పా శిరోద్కర్ కూడా వచ్చి సందడి చేశారు. ఇకపోతే స్టేజ్ పై శిల్పా శిరోద్కర్ ను చూడగానే నాగార్జున తన మనసులో మాటలను దాచుకోలేకపోయారు. ఆమెను చూడగానే నా పాత హీరోయిన్ అంటూ గుర్తు చేసుకున్నారు.
అటు నాగార్జునను చూడగానే ఉబ్బితబ్బిబయిపోయిన శిల్పా శిరోద్కర్ కూడా నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ.." జీవితం అనేది ఒక సైకిల్ లాంటిది. గతంలో నేను, నాగార్జున కలిసి నటించాము. పైగా హిందీ బిగ్ బాస్ సీజన్ 18లో నేను పార్టిసిపేట్ చేశాను. మళ్లీ తెలుగు బిగ్ బాస్ స్టేజ్ పై ఇలా కనిపించడం మరింత సంతోషంగా ఉంది" అంటూ తెలిపింది. మొత్తానికైతే నాగార్జున శిల్పా శిరోద్కర్ ఒకరికొకరు కలుసుకొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మరొకవైపు జటాధర చిత్ర బృందం హౌస్ సభ్యులతో కలిసిపోయి ఆటలు, పాటలు, జోక్స్, పంచులతో సందడి చేశారు. జటాధర మూవీ టీం రాకతో హౌస్ లో అసలైన దీపావళి పండుగ మొదలైంది అంటూ బిగ్ బాస్ లవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది.
ఇదిలా ఉండగా.. 1992లో విడుదలైన భారతీయ ఇతిహాస నాటక చిత్రం ఖుదా గవా.. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, నాగార్జున, శిల్పా శిరోద్కర్, డానీ డెంజోంగ్పా, కిరణ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముకుల్ ఎస్ ఆనంద్ రచనా, దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ మ్యూజిక్ అందించారు.
సుధీర్ బాబు జటాధర సినిమా విషయానికొస్తే.. వెంకట్ కళ్యాణ్ , అభిషేక్ జైష్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనేలా ట్రైలర్ నిరూపించింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
