Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ స్పెష‌ల్ : గేమింగ్ అథ్లెట్ సంపాద‌న గురించి తెలిస్తే అవాక్కే!

ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రీడలు.. ఇస్పోర్ట్స్ .. సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా అపారమైన ఆదాయ మార్గాలుగా మారాయి.

By:  Sivaji Kontham   |   8 Sept 2026 2:37 AM IST
బిగ్ బాస్ స్పెష‌ల్ : గేమింగ్ అథ్లెట్ సంపాద‌న గురించి తెలిస్తే అవాక్కే!
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రీడలు.. ఇస్పోర్ట్స్ .. సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా అపారమైన ఆదాయ మార్గాలుగా మారాయి. మైదానంలో ఆడే అథ్లెట్లతో పాటు వర్చువల్ ప్రపంచంలో గేమింగ్ అథ్లెట్లుగా రాణిస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు నెలకు రూ. 30 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు అర్జిస్తూ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తాజాగా ప్రసారమవుతున్న పాపుల‌ర్ రియాలిటీ షో `బిగ్ బాస్ 20` వేదికగా టీమిండియా ఇ-స్పోర్ట్స్ స్టార్.. డిజిటల్ క్రియేటర్ తన్మయ్ `స్కావుట్` సింగ్ (ScoutOP) తన నెలవారీ సంపాదనను బయటపెట్టి ఏకంగా వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్‌నే ఆశ్చర్యపరిచారు.

ఒక్క బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండానే కేవలం సోషల్ మీడియా, ఇస్పోర్ట్స్ ఆధారంగా నెలకు భారీగా సంపాదిస్తున్న అగ్రగామి ఇన్‌ఫ్లూయెన్సర్లు, అథ్లెట్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు భారతీయ డిజిటల్ స్పేస్‌ను శాసిస్తున్నారు. అటువంటి వారిలో `టాప్-10 పాపుల‌ర్ ఇన్‌ఫ్ల్యూయన్స‌ర్ కంటెస్టెంట్స్ వివ‌రాలు చూస్తే....

క్రీడా రంగానికి చెందిన ఒలింపిక్ విజేతలు మొదలుకుని యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న డిజిటల్ క్రియేటర్ల వరకు నేడు సాంప్రదాయ ఆదాయ మార్గాలను దాటి సరికొత్త ఆదాయ ఆర్జ‌న‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. గేమింగ్‌లో తన సత్తా చాటుతూ నెలకు రూ. 30 లక్షలకు పైగా అర్జిస్తున్న ఇస్పోర్ట్స్ అథ్లెట్ తన్మయ్ సింగ్ .. భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లు సంపాదిస్తుండగా.. యూట్యూబ్ ప్రపంచాన్ని శాసిస్తున్న క్యారీమినాటి (అజేయ్ నగర్), ఎల్విష్ యాదవ్, అభిషేక్ మల్హన్‌లు తమ కంటెంట్, బిజినెస్‌లు , స్పాన్సర్‌షిప్‌ల ద్వారా నెలకు రూ. 25 నుండి 50 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా రీల్స్‌తో మనీషా రాణి, సంగీత కాన్సెర్టులతో ఎంసి స్టాన్, స్టాండప్ కామెడీ - ప్రమోషన్లతో మునావర్ ఫరూకీ, నటనతో ఆసిఫ్ ఖాన్ .. బుల్లితెర క్రేజ్‌తో కనిక మన్‌లు విపరీతమైన పాపులారిటీతో పాటు నెలకు లక్షల్లో ఆర్జిస్తూ బిగ్ బాస్ వంటి పాపులర్ షోలకు మరింత ప్రాచుర్యాన్ని తెచ్చిపెడుతున్నారు.

గ్రాండ్ ప్రీమియర్ వేదికపై సల్మాన్ ఖాన్ ''గేమింగ్ కేవలం సరదా కోసమే ఆడుతారా లేక ఇదో వృత్తియా?'' అని ప్రశ్నించగా... తన్మయ్ తనకు ఇందులో గొప్ప `కిక్` లభిస్తుందని చెప్పారు. ఎంత సంపాదిస్తావని సల్మాన్ అడగ్గా... తన్మయ్ అత‌డి చెవిలో ఒక సంఖ్య చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయిన సల్మాన్ బిగ్గరగా ''నెలకు రూ. 30 లక్షలా?'' అని రియాక్ట్ అయ్యారు. దానికి తన్మయ్ సమాధానమిస్తూ... తాను రూపాయి రూపాయి కష్టపడి చెక్కుల రూపంలో పన్నులు చెల్లించి సంపాదించే వైట్ మనీ ఇది అని స్పష్టం చేశారు. దీంతో మురిసిపోయిన సల్మాన్ ``30 లక్షలు అదీ వైట్ మనీ అని గర్వంగా చెప్పుకో`` అంటూ టీవీ చూస్తున్న పిల్లలను కూడా గేమింగ్‌ను సీరియస్‌గా తీసుకోమని సరదాగా ప్రోత్సహించారు.

ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ (ఐజీసీ) లో `గోట్` (GOAT) గా పిలువబడే స్కావుట్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక సుదీర్ఘ ప్రయాణం ఉంది. పబ్జీ (BGMI) ప్లేయర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి టీమ్ ఇండ్, టీమ్ సోల్, ఫనాటిక్ , ఆరెంజ్ రాక్ వంటి అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు చేసే లైవ్ స్ట్రీమింగ్స్.. బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు.. టోర్నమెంట్ ప్రైజ్ మనీలు.. వ్లాగ్స్ ద్వారా ఆయనకు ఈ భారీ నెలవారీ ఆదాయం సమకూరుతోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ 20 హౌస్‌లోకి స్కావుట్ అడుగుపెట్టడంతో గేమింగ్ రంగం -డిజిటల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సందర్భంగా అత‌డికి మద్దతుగా ఎల్విష్ యాదవ్, ఫుక్రా ఇన్సాన్, క్యారీమినాటి వంటి అగ్ర డిజిటల్ క్రియేటర్లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తనదైన యూనిక్ గేమింగ్ స్కిల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తన్మయ్ సింగ్.. ఇప్పుడు రియాలిటీ షో వేదికగా కూడా విజేతగా నిలిచి ట్రోఫీని గెలవాలని ఐజిసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.