రెజ్లింగ్ స్టార్ (X) బాక్సింగ్ స్టార్ : బిగ్‌బాస్ 19 ఫుల్ జోష్
ఎన్నడూ లేని విధంగా ఈసారి సీజన్ 19లో ఒక ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్, పాపులర్ బాక్సర్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
By: Sivaji Kontham | 24 Aug 2025 9:15 AM ISTహిందీ బిగ్ బాస్ 18 సీజన్లలో మొత్తం 12 సీజన్లను దిగ్విజయంగా నడిపించాడు సల్మాన్ ఖాన్. భారతదేశంలో అత్యంత సక్సెస్‌ఫుల్ హోస్ట్ గా సల్మాన్ ఖ్యాతిని ఘడించాడు. ఈసారి సీజన్ 19లోను సల్మాన్ హోస్టింగ్ పై అంచనాలున్నాయి. అతడు టీఆర్పీలను రాబట్టడంలో కింగ్ అన్న పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రతి సీజన్ లానే ఈసారి కూడా సీజన్ 19 కోసం ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించేందుకు బిగ్ బాస్ టీమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.
ఎన్నడూ లేని విధంగా ఈసారి సీజన్ 19లో ఒక ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్, పాపులర్ బాక్సర్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో బిగ్ బాస్ టీమ్ మంతనాలు సాగిస్తోందని కథనాలొచ్చాయి. కానీ ఇప్పటికీ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. టైసన్ షోలో పాల్గొనేందుకు అంగీకరించారా లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకుముందు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం మైక్ టైసన్ కొన్ని కాల్షీట్లను కేటాయించారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఒక భారతీయ టెలివిజన్ షో కోసం అతడు సమయాన్ని కేటాయిస్తారా? అన్నది సస్పెన్స్ గా ఉంది.
తాజా సమాచారం మేరకు ప్రముఖ రెజ్లర్, అమెరికా టెక్సాస్ స్టార్ ప్లేయర్ `ది అండర్ టేకర్` ఈసారి హిందీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తారని గుసగుస వినిపిస్తోంది. `ది అండర్ టేకర్`కి ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఇ ఆటగాడిగా అసాధారణ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో అతడి ఎంట్రీ షోకి మరింత బూస్ట్ ఇస్తుందని సల్మాన్ బృందం భావిస్తోంది. అండర్ టేకర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని, నవంబర్ లో అతడి ఎంట్రీ ఉంటుందని లీకులు అందాయి. అయితే దీనిపై ఇంకా సల్మాన్ కానీ, అతడి బృందం కానీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ది అండర్ టేకర్ అసలు పేరు మార్క్ విలియమ్ కాలవే. ఈసారి సీజన్ లో అతడి ప్రవేశం మరింత ఉత్సాహం పెంచుతుందని భావిస్తున్నారు. గౌరవ్ ఖన్నా, అష్నూర్ కౌర్, బసీర్ అలీ, అభిషేక్ బజాజ్, సివెట్ తోమర్, అవేజ్ దర్బార్ , నగ్మా మిరాజ్కర్ తదితరులు షోలో పాల్గొంటున్నారని ఇప్పటికే ధృవీకరించారు. సల్మాన్ ఖాన్ సికందర్ తర్వాత గాల్వాన్ లోయ బాహాబాహీ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తున్నారని కథనాలొచ్చాయి. కానీ ఇండియా - చైనా బార్డర్ వార్ నేపథ్యంలోని ఈ సినిమాని మధ్యంతరంగా నిలిపి వేసారని, దీనికి కారణం చైనాతో ఇండియా సంబంధాలను పునరుద్ధరించడమేనని క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ వెల్లడించారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.
