క్రేజీ మూవీ రిలీజ్‌కు ఓటీటీ బ్రేకులా?
కొంత మంది స్టార్స్ సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చేసుకున్న ఒప్పందాల కారణంగానే రిలీజ్‌కు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Ravindar Gorantla | 28 April 2026 9:00 PM ISTస్టార్ హీరోలు, భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లని అందించిన హీరోల సినిమాలకు ఇప్పుడు ఓటీటీ డీల్స్ ఇబ్బందికరంగా మారుతున్నాయా?.. కొంత మంది స్టార్స్ సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చేసుకున్న ఒప్పందాల కారణంగానే రిలీజ్‌కు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మూవీ `జన నాయగన్`. ఈ మూవీని ముందు జనవరి 9న పొంగల్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఆ తరువాత కోర్టు కేసులు, సెన్సార్ వివాదం కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి భిన్నంగా బ్యాక్‌టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో సంచలనం సృష్టించి ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేసిన హీరో మూవీ రిలీజ్‌కు ఓటీటీ డీల్ ఇప్పుడు అడ్డంకిగా మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ హీరో యష్ అని, ఆ సినిమా `టాక్సిక్` అని నెట్టింట వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ సినిమాల తరువాత సుధీర్ఘ విరామం తీసుకున్న యష్ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా `టాక్సిక్`లో నటించిన విషయం తెలిసిందే. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్‌తోనే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి సంచలనం సృష్టించింది. ఈ మూవీని ముందు మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే అదే సమయానికి `ధురంధర్ 2` రిలీజ్ అవుతుండటం, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వార్‌ని ప్రకటించి సుప్రీమ్ లీడర్ అయతుల్లా ఖమేనీని హతం చేయడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ సినిమాని రిలీజ్ చేయడం మంచిది కాదని, దాని మార్కెట్, వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన టీమ్ ఈ సినిమా రిలీజ్‌ని జూన్ 4కు వాయిదా వేశాయి.
అయితే ఇప్పుడు జూన్ 4న కూడా ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కారణం ఓటీటీ డీల్ ఇంకా పెండింగ్‌లో ఉండటమేనని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఔట్‌పుట్‌పై అనుమానాల వల్లే ఓటీటీ డీల్ ఆలస్యమవుతోందా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా?..ఓటీటీ డీల్ ఆలస్యం వల్లే రిలీజ్ లేట్ అవుతోందా? అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్‌లో మొదలైంది.
