Begin typing your search above and press return to search.

అలా జ‌రిగితే ఆస‌క్తి పెరుగుతుందా? త‌గ్గుతుందా?

అంటే వాయిదా వేస్తున్నప్పుడు మేకర్స్ ప్రేక్షకులతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? సినిమా అప్‌డేట్స్‌ను ఎలా ఇస్తున్నారు? అనే దానిపైనే ఆసక్తి పెరుగుతుందా ? లేక‌ తగ్గుతుందా అనేది ఆధారపడి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   10 April 2026 8:15 AM IST
అలా జ‌రిగితే ఆస‌క్తి పెరుగుతుందా? త‌గ్గుతుందా?
X

నేటి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలంటే కేవలం యాక్షన్, డ్రామా మాత్రమే కాదు. అవి ఒక విజువల్ వండర్స్. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ ,పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మేకర్స్ ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని పదేపదే వాయిదా వేయడం వల్ల ప్రేక్షకుల్లో ఒక రకమైన సానుకూల అంచనా ఏర్పడుతుంది. మేకర్స్ ఇంత సమయం తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో అద్భుతాన్ని చూపించ బోతున్నారు అనే నమ్మకం అభిమానుల్లో కలుగుతుంది. ఇది సినిమాపై ఉన్న క్యూరియాసిటీని అంత‌కంత‌కు పెంచుతుంది.

అయితే వాయిదాలు పరిమితి దాటితే మాత్రం నెగటివ్ బజ్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక సినిమాను ఒకటి లేదా రెండుసార్లు వాయిదా వేస్తే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. కానీ పదేపదే విడుదల తేదీలను మారుస్తుంటే సినిమాపై ఉన్న హైప్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. సినిమాలో ఏదో సమస్య ఉంది. అవుట్‌పుట్ సరిగ్గా రావడం లేదు. లేదా నిర్మాణంలో లోపాలు ఉన్నాయి అనే పుకార్లు అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఇది బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక పరమైన అంశాలు కూడా ముఖ్యం.

సినిమా విడుద‌ల‌ ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది. ఇది నిర్మాతలకు పెద్ద చిక్కుగా మారుతుంది. సినిమా బిజినెస్ సమీకరణాలు మారిపోతాయి. డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సినిమా విడుదల ఆలస్యమైతే ఆ గ్యాప్‌లో ఇతర సినిమాలు వచ్చే అవకాశం ఉండటంతో థియేటర్ల లభ్యత కూడా సమస్యగా మారుతుంది. ఇది సినిమా విజయానికి అడ్డంకిగా మారొచ్చు. ప్రేక్షకులు ఎప్పుడూ తాజాదనాన్ని కోరుకుంటారు. ఒక సినిమా షూటింగ్ మొదలై సంవత్సరాలు గడుస్తున్నా విడుదల కాకపోతే? ఆ సినిమాలోని అంశాలు పాతబడిపోయే అవకాశం ఉంటుంది.

ఫ్యాషన్, టెక్నాలజీ కథాంశాలు కాలక్రమేణా మారిపోతుంటాయి. అందుకే క్వాలిటీ కోసం సమయం తీసుకోవడం మంచిదే అయినా? అది ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారకూడదు. సరైన సమయంలో సినిమాను థియేటర్లోకి తీసుకురావడం అనేది ముఖ్యం. వాయిదా పడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు క్వాలిటీ కోసం చాలాసార్లు వాయిదా పడ్డాయి. కానీ ఆ చిత్రాల దర్శకుడిపై ఉన్న నమ్మకం టీజర్లు, ట్రైలర్లతో క్రియేట్ చేసిన హైప్ వల్ల ప్రేక్షకులు ఎంతకాలమైనా వేచి చూశారు.

అంటే వాయిదా వేస్తున్నప్పుడు మేకర్స్ ప్రేక్షకులతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? సినిమా అప్‌డేట్స్‌ను ఎలా ఇస్తున్నారు? అనే దానిపైనే ఆసక్తి పెరుగుతుందా ? లేక‌ తగ్గుతుందా అనేది ఆధారపడి ఉంటుంది.

క్వాలిటీ కోసం సినిమాను వాయిదా వేయడం అనేది అవసరమే కావచ్చు. కానీ అది వ్యూహాత్మకంగా ఉండాలి. పదేపదే తేదీలు మార్చడం వల్ల వచ్చే నెగటివిటీని అధిగమించాలంటే మేకర్స్ అద్భుతమైన కంటెంట్‌తో తిరిగి రావాలి. చివరకు సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎన్ని వాయిదాలనైనా మర్చిపోతారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పూర్తిగా చిత్ర యూనిట్‌పైనే ఉంటుంది. క్వాలిటీ అద్భుతంగా ఉంటే అదొక చరిత్ర అవుతుంది. లేదంటే వాయిదాలే ఆ సినిమాకు శాపంగా మారుతాయిన్న‌ది గుర్తించాలి.