దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?
ఈ వక్రీకరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా సదరు మీడియా సంస్థపై విరుచుకుపడ్డారు.
By: Srikanth Kontham | 3 Nov 2026 11:20 PM ISTబిగ్ బీ అమితాబచ్చన్ వ్యక్తిత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో .. సోషల్ మీడియాలో వివాదాలకు దూరంగా ఉంటారు. సానుకూల విషయాలను మాత్రమే పంచుకుంటారు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థ వ్యవహరించిన తీరు బిగ్ బీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. భక్తి భావంతో కూడిన పోస్ట్‌ను వక్రీకరించి రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలా ప్రచురించడంపై అమితాబ్ మండిపడ్డారు.
వివాదానికి అసలు కారణం ఏంటంటే? కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ హోథీ ఘోడా పల్కీ.. జై కన్హయ్య లాల్ కీ అంటూ భక్తిపూర్వకంగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. అయితే ఓ వార్తా సంస్థ దీన్ని అమితాబ్ తన రాజకీయ ..వ్యక్తిగత ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారని మీరు ఏనుగులు, గుర్రాలు తెచ్చుకోండి.. మేం మా ఆయుధాలతో పోరాడతాం` అంటూ సవాలు విసిరారంటూ కథనం రాసింది. భక్తి భావంతో కూడిన పవి త్రమైన కీర్తనను ఇలా అసంబద్ధమైన రీతిలో రాజకీయం చేయడం అమితాబ్‌ను తీవ్రంగా కలచివేసింది.
ఈ వక్రీకరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా సదరు మీడియా సంస్థపై విరుచుకుపడ్డారు. టీఆర్పీల కోసం, పబ్లిసిటీ కోసం పవిత్రమైన దేవుడి కీర్తనలను కూడా దుర్వినియోగం చేస్తూ తనను తన ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నట్లు చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీడియా సంస్థల అనైతిక పోకడను తీవ్ర పదజాలంతో ఖండించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రస్తావించారు. దీంతో అమితాబ్ హెచ్చరిక బాలీవుడ్లో సంచలనంగా మారింది. తనకు సోషల్ మీడియాలో 5 కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని.. తాను గనుక ఒక్క సిగ్నల్ ఇస్తే అందులో 10 శాతం మంది ఆ మీడియా సంస్థను నిలదీయడానికి రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. తన మాటలను ..ట్వీట్లను నిరాధారంగా వక్రీకరిస్తే అభిమానులు వంద రెట్లు ఎక్కువగా ప్రతిస్పందిస్తారని.. ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
శాంతంగా ఉండే లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఈ స్థాయిలో బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. వక్రీకరణలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బీ తీసుకున్న స్టాండ్ సోషల్ మీడియా లో పెద్ద చర్చకు తెర తీస్తుంది.
భక్తి భావంతో చేసిన చిన్న పోస్ట్‌ను మీడియా సంస్థలు ఎంతటి వివాదంగా మార్చాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఏదేమైనా? తప్పుడు కథనాలను, వక్రీకరణలను ఎప్పుడూ సహించని అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించి బలమైన హెచ్చరిక పంపారనే చెప్పాలి.
