హీరోగా యూట్యూబర్.. స్టార్ ఫిల్మ్ మేకర్ చేతిలో..!
ఒకప్పుడు సినిమాల్లో ఆఫర్లు రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రొడక్షన్ ఆఫీస్‌ల చుట్టూ, దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
By: Ramesh Palla | 3 Sept 2025 1:00 AM ISTఒకప్పుడు సినిమాల్లో ఆఫర్లు రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రొడక్షన్ ఆఫీస్‌ల చుట్టూ, దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడకు నిర్మాతలు, దర్శకులు వెళ్తున్నారు. ఆ ప్రతిభ చూపించేందుకు ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఈ మధ్య కాలంలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్స్ లో ఎక్కువ శాతం సోషల్ మీడియా ద్వారా వచ్చిన వారు కావడం విశేషం. సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చిన అమ్మాయిలను తీసుకు వచ్చి హీరోయిన్స్‌గా చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ప్రభాస్ వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం ద్వారా ఏ స్థాయిలో సోషల్ మీడియా ప్రభావం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్
ఇంకా ఎంతో మంది సినిమాలతో పోల్చితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన గుర్తింపు ఒక్క అందమైన ఫోటో షూట్‌తో లేదా అందాల ఆరబోత వీడియోతో వైరల్ అయ్యి దక్కించుకున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది వస్తూ ఉన్నారు. అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా యూట్యూబ్ ద్వారా వస్తున్న వారు చాలా మంది ఉన్నారు. తెలుగు యూట్యూబర్ లు ఇప్పటికే కొందరు టాలీవుడ్‌లో అడుగు పెట్టారు. బాలీవుడ్‌లోనూ ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పిలిచి మరీ యూట్యూబర్ భువన్ బామ్ కి అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా బిగ్ బ్రేక్‌కి హెల్ప్ చేస్తున్నాడు.
భువన్ బామ్ హీరోగా
ఒక చిన్న యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన భువన్ ఇప్పుడు ఇండియాలోనే టాప్ యూట్యూబర్ గా నిలిచాడు. ఒక చిన్న రూమ్ నుంచి యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేసిన భువన్ కోట్ల రూపాయలను సంపాదించే స్థాయికి చేరుకున్నాడు. దాదాపుగా రెండున్నర కోట్ల మంది ఆయన్ను యూట్యూబ్ ద్వారా ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మరింత మంది ఫాలో అవుతూ ఉన్నారు. అందుకే యూట్యూబర్ గా భువన్ బాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చర్యపోయే విధంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఇప్పటికే వెబ్ సిరీస్‌లను చేయడం మొదలు పెట్టిన భువన్ త్వరలోనే వెండి తెరపై మెరిసేందుకు గాను రెడీ అవుతున్నాడు అంటూ అధికారికంగా ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ప్రకటన వచ్చింది.
వామిక గబ్బి హీరోయిన్‌గా శరణ్ శర్మ దర్శకత్వంలో..
కరణ్ జోహార్ ఆచి తూచి సినిమాలను చేస్తూ ఉంటాడు. ఆయన నిర్మాణంలో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎంతో మందిని స్టార్స్‌గా మార్చిన ఘనత కరణ్ జోహార్‌కి ఉంది. ఎంతో మంది స్టార్స్ తమ పిల్లలను కరణ్ జోహార్ బ్యానర్ ద్వారా లేదా ఆయన దర్శకత్వంలో పరిచయం చేయాలని అనుకుంటారు. అలాంటి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భువన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీలో హీరోయిన్‌గా వామికా గబ్బిని ఎంపిక చేశారు. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా చకచక పనులు జరిగి పోతున్నాయి. బాలీవుడ్‌లో భువన్ బామ్ ఏ మేరకు విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనేది కాలమే నిర్ణయించాలి.
