36,000 కోట్ల నికర ఆస్తులతో ఖాన్‌లను మించిన ధనవంతుడు!
ముగ్గురు ఖాన్‌ల ఆస్తులను కలిపినా అతడి కాలి గోటిని కూడా టచ్ చేయలేరు. అతడు ఫిలిం బిజినెస్ వరల్డ్ లో నిజమైన ఎదురే లేని కింగ్.
By: Sivaji Kontham | 1 Oct 2026 1:00 AM ISTముగ్గురు ఖాన్‌ల ఆస్తులను కలిపినా అతడి కాలి గోటిని కూడా టచ్ చేయలేరు. అతడు ఫిలిం బిజినెస్ వరల్డ్ లో నిజమైన ఎదురే లేని కింగ్. దశాబ్ధాలుగా బాలీవుడ్ ని ఏల్తున్న అతడి మొత్తం నికర ఆస్తి విలువ 36,000 కోట్లు. అతడు ఎవరో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేవలం హీరోలు, దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా.. వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి టెక్ సీఈవోలతో సమానంగా సంపాదిస్తున్న వ్యక్తులు ఉన్నారు. తాజాగా విడుదలైన `హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026` నివేదిక ప్రకారం.. బాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా ప్రముఖ మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ దిగ్గజం టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిలిచారు. ఆయన మొత్తం నికర ఆస్తి విలువ అంతులేని సంపదతో ఏకంగా రూ. 36,300 కోట్లకు (3.8 బిలియన్ డాలర్లు) చేరుకుంది.
ఈ భారీ సంపదతో భూషణ్ కుమార్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి టాప్ స్టార్ల సంపదను సైతం వెనక్కి నెట్టేశారు. పరిశ్రమలో అత్యంత సంపద కలిగిన నటుడిగా షారుఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 9,500 కోట్లుగా ఉండగా.. ఈ ముగ్గురు ఖాన్ల (షారుఖ్, సల్మాన్, ఆమిర్) మొత్తం సంపద కలిపితే సుమారు రూ. 15,000 కోట్లు మాత్రమే అవుతుంది. అంటే ఈ ముగ్గురు స్టార్ హీరోల సంపద కంటే భూషణ్ కుమార్ ఆస్తులు రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
అంతేకాకుండా.. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రూ. 24,600 కోట్లు, ప్రముఖ నిర్మాత రొన్నీ స్క్రూవాలా రూ. 16,000 కోట్లతో అసాధారణ స్థితిలో ఉన్నా.. ఇలాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టి భూషణ్ కుమార్ భారతదేశపు అత్యంత ధనవంతుడైన సినిమా నిర్మాతగా అగ్రస్థానంలో నిలిచారు. కేవలం రెండేళ్ల క్రితం (2024 హూరున్ జాబితా ప్రకారం) రూ. 10,500 కోట్లుగా ఉన్న భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తులు.. ఇటీవలి కాలంలో ఏకంగా 3.5 రెట్లు పెరిగిపోవడం విశేషం.
టీ-సిరీస్ ప్రస్థానం - డిజిటల్ రికార్డులు:
దివంగత గుల్షన్‌కుమార్ 1983లో స్థాపించిన `సూపర్ క్యాసెట్స్ లిమిటెడ్` (టీ సిరీస్) సంస్థను... 1997లో ఆయన మరణాంతరం కేవలం 19 ఏళ్ల వయసులోనే భూషణ్ కుమార్ తన బాధ్యతలోకి తీసుకున్నారు. అప్పట్లో కేవలం మ్యూజిక్ రికార్డ్ లేబుల్‌గా ఉన్న ఈ సంస్థను.. ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల వైపు విస్తరించి ఒక మీడియా సామ్రాజ్యంగా మార్చారు. ప్రస్తుతం భారతీయ మ్యూజిక్ మార్కెట్‌లో టి-సిరీస్ ఏకంగా 35 శాతం వాటాను కలిగి ఉంది.
అలాగే డిజిటల్ రంగంలోనూ ఈ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఛానెల్‌గా ( మిస్టర్ బీస్ట్ తర్వాత) టి-సిరీస్ కొనసాగుతోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ (353 బిలియన్లకు పైగా) సాధించిన నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్‌గా రికార్డు సృష్టించింది. నటనకు లేదా దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం అద్భుతమైన వ్యాపార వ్యూహాలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో భూషణ్ కుమార్ సాధించిన ఈ అరుదైన మైలురాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ చిత్ర పరిశ్రమలో నిర్మాణ రంగం- డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఇంత భారీ స్థాయి సంపదను ఆర్జించవచ్చని ఈ రిపోర్ట్ మరోసారి రుజువు చేసింది.
