పవన్ కళ్యాణ్ గురించి భూమిక..!
'యుఫోరియా'లో భూమిక కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
By: Ramesh Palla | 27 Jan 2026 12:17 PM ISTసీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'యుఫోరియా' విడుదలకు సిద్ధం అయింది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యుఫోరియా సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమం వైజాగ్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు హాజరు అయిన ఈ కార్యక్రమంలో పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ఒక స్టార్ హీరో సినిమా ఈవెంట్ రేంజ్ లో అభిమానులు, జనాలు హాజరు కావడంతో సినిమా సాంగ్ లాంగ్ ఈవెంట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా ఇప్పటికే జనాల్లోకి చేరిందని, ఈ కార్యక్రమంతో మరింతగా సినిమా గురించి జనాలు చర్చించుకోవడం ద్వారా కచ్చితంగా మంచి ఓపెనింగ్ సినిమాకు దక్కుతుంది అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
యుఫోరియా లో భూమిక...
'యుఫోరియా'లో భూమిక కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తల్లి పాత్రలో ఆమె కనిపించిన తీరు, ఈతరం తల్లులు ఎలా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనం అన్నట్లుగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా పట్ల మొదటి నుంచి భూమిక చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ ఇది తనకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి సినిమా అవుతుంది అన్నట్లుగా పేర్కొన్నారు. అంతే కాకుండా గుణశేఖర్ గారితో చాలా ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది అన్నారు. యుఫోరియా సినిమాలో భూమిక పాత్రను చూసిన తర్వాత చాలా మంది తల్లులు తమ పిల్లల విషయంలో ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న తల్లలు కాస్త టెన్షన్ పడుతారని, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారని మేకర్స్ చెబుతున్నారు.
ఖుషి నుంచి ఉపముఖ్యమంత్రి స్థాయికి పవన్ కళ్యాణ్
వైజాగ్‌లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో భూమిక మాట్లాడుతూ... ఇక్కడ ఈవెంట్‌కి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. నా పూర్తి కెరీర్‌లో యుఫోరియా సినిమా టాప్ లో నిలుస్తుంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను పిల్లల తల్లిదండ్రులు కనెక్ట్ అయ్యి చూస్తారు. థియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మంచి ఆలోచనతో ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో ఖుషి సినిమాలో కలిసి నటించాను. ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఆయనతో కలిసి నటించినందుకు గర్విస్తున్నాను అంది. ఆయనతో జర్నీ చాలా స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన ఖుషి నుంచి ఉప ముఖ్యమంత్రిగా మారిన తీరు నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు.
గుణ శేఖర్ దర్శకత్వంలో యుఫోరియా
భూమిక ప్రధాన పాత్రలో నటించిన యుఫోరియా సినిమాలో సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసు దేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణలు సంయుక్తంగా నిర్మించారు. రాగిణి గుణ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. చాలా కాలం తర్వాత గుణశేఖర్ సోషల్ మూవీతో రాబోతున్నాడు. రుద్రమదేవి, శాకుంతలం సినిమాల తర్వాత గుణశేఖర్ ఈ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. ఆయన చివరగా నిప్పు సినిమాతో సోషల్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను చాలా విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ తన నుంచి సినిమాలు వస్తాయని చెబుతున్నాడు. ఇక భూమిక సైతం ఈ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అవుతుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు.
