పశ్చాత్తాపం పడుతోన్న హీరోయిన్!
బాలీవుడ్ లో భూమీపడ్నేకర్ కెరీర్ ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 6 March 2026 12:26 PM ISTబాలీవుడ్ లో భూమీపడ్నేకర్ కెరీర్ ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచలంచెలుగా ఎదిగిన నటి. తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీ పోటిని తట్టుకుని నిలబడిన నటి. భూమీ పడ్నేకర్ నేరుగా హీరోయిన్ అవ్వలేదు. తెర వెనుక నుండి తెర ముందుకు వచ్చిన నటి. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మ వద్ద అసిస్టెంట్‌గా ప్రారంభమైంది. సుమారు ఆరేళ్ల పాటు అసిస్టెంట్ గానే కొనసాగింది. అలా ఎంతో మందిని తన చేతుల మీదుగా వెండి తెరకు ఎంపిక చేసింది.
అలా ఓ సందర్భంలోనే ఓ ఆడిషన్ లో తానే హీరోయిన్ గా అనుకోకుండా సెలక్ట్ అయింది. అదే అమ్మడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి బాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతుంది. నాటి నుంచి నేటి వరకూ ఎన్నో వైవిథ్యమైన పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదిం చుకుంది. సహజంగా చాలా మంది హీరోయిన్లు మొదటి సినిమాలో అందంగా, గ్లామరస్‌గా కనిపించాలని కోరుకుంటారు. కానీ భూమి పెడ్నేకర్ తన మొదటి సినిమా `దమ్ లగా కే హైషా` కోసం ఏకంగా 30 కిలోల బరువు పెరిగింది.
ఒక మధ్య తరగతి కుటుంబంలో లావుగా ఉండే అమ్మాయి పాత్రను ఒప్పుకోవడం ఎంతో ఆసక్తికరమైంది. ఆ రిస్క్ ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు సహా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే వెండి తెరపై అంతే బోల్డ్ గానూ నటించింది. ఇంటిమేట్ సన్నివేశాల్లో ఏనాడు రాజీ పడింది లేదు. కంటెంట్ డిమాండ్ మేరకు హద్దులు లేకుండా చాలా సినిమాల్లో నటించింది. ఆ కారణంగా కొన్ని విమర్శలకు కూడా గురైంది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఇకపై తనని అగౌరవ పరిచే పాత్రలు చేయనని ప్రామిస్ చేసింది. గతంలో నటించిన చాలా సినిమాల్లో పాత్రల విషయంలో కొన్ని తప్పులు చేసినట్లు గుర్తు చేసుకుంది.
ఆ పాత్రలు ఇప్పుడు తెరపై చూస్తుంటే అలా చేసింది తానేనా? అన్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపింది. నిజానికి వాటిలో ఇష్టం లేకుండానే పని చేసినట్లు గుర్తు చేసుకుంది. భవిష్యత్ లో మాత్రం అలాంటి పాత్రలు చేయనని నటిగా హుందాగానే కొనసాగుతానని తెలిపింది. ఇటీవలే భూమీ పడ్నేకర్ నటించిన `దల్దాల్` సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో శక్తివంతమైన పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గత ఏడాది `మేరీ హస్బెండ్ కీ బివీ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతానికి అమ్మడి చేతిలో కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ లేవు. అంతర్ఆజతీయంగానూ వచ్చిన గుర్తింపుతో కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
