'భూత్ బంగ్లా'..ఓల్డ్ ఫార్మట్‌కూ జైకొట్టారు!
రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ వీక్ వారాంతం వరకు రూ.65 కోట్ల నికర వసూళ్లని రాబట్టింది.
By: Ravindar Gorantla | 20 April 2026 3:20 PM ISTరణ్‌వీర్ సింగ్ కథానాకుడిగా నటించిన స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్ 2`. ఇండియన్ సినిమాల్లో స్పై యాక్షన్ చిత్రాలతో పాటు రెగ్యులర్ ఫార్మాట్ మేకింగ్ విషయంలో విప్లవాత్మక మార్పులకు స్ట్రాంగ్‌గా షాక్ ఇచ్చిన మూవీ ఇది. రొటీన్ మేకింగ్‌కి, స్టోరీ టెల్లింగ్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ సినిమా రెండు భాగాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయాన్ని సాధించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల మేకింగ్ విషయంలో సరికొత్త చర్చకు తెరలేపింది.
`ధురంధర్`, `ధురంధర్ 2` చూసిన తరువాత రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలని ప్రేక్షకులు ఇష్టపడతారా? అనే స్థాయిలో `ధురంధర్ 2` తీవ్ర స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దీంతో తదుపరి సినిమాలు ఎలా తీయాలి? ..ఏ విధంగా తెరపైకి తీసుకురావాలనే చర్చ దర్శక నిర్మాతల్లో మొదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న `ధురంధర్ 2` ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.1791.42 అంటే దాదాపుగా రూ.1800 కోట్ల మైలురాయికి చేరువ అయ్యిందన్నమాట. ఈనేపథ్యంలోనే ఈ నెలలో రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.
`ధురంధర్ 2` థియేటర్లలో ఉండగానే రెండు సార్లు వాయిదా పడిన అక్షయ్ కుమార్ `భూత్ బంగ్లా` ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పరేష్ రావల్, వామిక గబ్బి, టబు, మనోజ్ జోషీ కీలక పాత్రల్లో నటించారు. కామెడీ హారర్ చిత్రాలని ప్రేక్షకులకు అందించడంతో ప్రియదర్శన్‌ది ప్రత్యేక శైలి. కొంత విరామం తరువాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ వీక్ వారాంతం వరకు రూ.65 కోట్ల నికర వసూళ్లని రాబట్టింది. అయితే సినిమాకు ఎలాంటి అడ్డు లేకపోయినా రూ.200 కోట్లకు మైగా వసూళ్లని రాబట్టే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. `ధురంధర్ 2` ప్రభావం కొంత మేరకు ఉన్నా కానీ సరైన కంటెంట్ ఉంటే ఏ బ్లాక్ బస్టర్ మూవీ ప్రభావం మరో సినిమాపై పడే అవకాశం లేదు. ఇదే విషయాన్ని `భూత్ బంగ్లా` నిరూపించింది. అంటే కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ సినిమాతో మరో సారి నిరూనించబడింది.
