Begin typing your search above and press return to search.

పెద్ద హీరోని రీప్లేస్ చేస్తూ 200 కోట్ల క్లబ్‌లు కొట్టేస్తున్నాడు!

అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరో నుంచి లీడ్ రోల్‌ను లాక్కుని.. దానికి రెట్టింపు స్థాయిలో విజయాన్ని అందించడం ద్వారా కార్తీక్ ఆర్యన్ తన స‌త్తా ఏంటో చూపించాడు.

By:  Sivaji Kontham   |   23 July 2026 8:15 AM IST
పెద్ద హీరోని రీప్లేస్ చేస్తూ 200 కోట్ల క్లబ్‌లు కొట్టేస్తున్నాడు!
X

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హారర్-కామెడీ ఫ్రాంచైజీగా `భూల్ భూలయ్యా`కు ఉన్న గుర్తింపు వేరు. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా చిత్రీక‌ర‌ణ‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. 2007లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా ప్రారంభమైన ఈ సిరీస్‌ను.. ఆ తర్వాత యువ హీరో కార్తీక్ ఆర్యన్ తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించారు. అక్షయ్ కుమార్‌ను పూర్తిస్థాయిలో రీప్లేస్ చేస్తూ `రూహ్‌ బాబా` పాత్రలోకి ప్రవేశించిన కార్తీక్... బాక్సాఫీస్ వద్ద వరుసగా 200 కోట్ల క్లబ్‌లతో వసూళ్ల సునామీ సృష్టించారు. `భూల్ భూలయ్యా 3` తర్వాత ఇప్పుడు `భూల్ భూలయ్యా 4`లో కూడా అత‌డే కథానాయకుడిగా నటించనున్నారు.

హ్యాట్రిక్ హిట్లతో దూకుడుమీదున్న‌ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల కథనాల ప్రకారం.. భూషణ్ కుమార్ .. అత‌డి క్రియేటివ్ టీమ్ ఇప్పటికే `భూల్ భూలయ్యా 4` స్క్రిప్టు ప‌నుల్ని వేగ‌వంతం చేసారు. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. భూల్ భులాయాను భారతదేశంలోనే అతిపెద్ద హారర్-కామెడీ ఫ్రాంచైజీగా నిలబెట్టాలనేది వారి ముఖ్య ఉద్దేశం. హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఈ క్రియేటివ్ ప్రాసెస్‌లో భాగస్వామి అవుతూ.. ప్రొడక్షన్ టీమ్‌తో కలిసి మరొక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక ఈ నాలుగో భాగానికి కూడా అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రెండు, మూడు భాగాలు అద్భుతమైన విజయాన్ని సాధించ‌డంతో నాలుగో భాగానికి సంబంధించిన ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌పైనా, వ్యాపారం గురించి కొద్దిరోజులుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇవి కొలిక్కి రాగానే, కార్తీక్ - అనీస్ బజ్మీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌గా `భూల్ భూలయ్యా 4` అధికారికంగా ఖరారు కానుంది. ఈ మూవీతో కార్తీక్ ఆర్యన్ ఖాతాలో మరో 200 కోట్ల క్లబ్ సినిమా చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరో నుంచి లీడ్ రోల్‌ను లాక్కుని.. దానికి రెట్టింపు స్థాయిలో విజయాన్ని అందించడం ద్వారా కార్తీక్ ఆర్యన్ తన స‌త్తా ఏంటో చూపించాడు. సీనియర్ హీరోను రీప్లేస్ చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో నేటితరం కుర్ర హీరోల్లో కార్తీక్ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. అదిరిపోయే హారర్ - కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కార్తీక్ పార్ట్-4లో కూడా అదే స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం దర్శకుడు అనీస్ బజ్మీ, అక్షయ్ కుమార్‌తో ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే పూర్తి స్థాయిలో `భూల్ భూలయ్యా 4` స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టనున్నారు. అన్నీ ప్రణాళిక ప్రకారం కుదిరితే 2027 ద్వితీయార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కార్తీక్ ఆర్యన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన రికార్డులను తానే తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు.