రెండు ఔట్.. శర్వాకు ఇదే బెస్ట్ చాన్స్
నవంబర్ 27న విడుదల కానున్న శర్వానంద్ ‘భోగి’కి బాక్సాఫీస్ వద్ద పోటీ తగ్గింది. అదే రోజు రావాల్సిన బెల్లంకొండ ‘హైందవ’, రష్మిక ‘మైసా’ వాయిదా పడటంతో అదనపు థియేటర్లు దక్కే అవకాశం ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో శర్వానంద్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ట్రైలర్ రెస్పాన్స్ కీలకంగా మారింది.
By: M Prashanth | 22 Nov 2026 4:51 PM ISTనవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న శర్వానంద్ 'భోగి' సినిమాకు విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద మంచి అడ్వాంటేజ్ దొరికింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక సరిగ్గా ఈ ఈవెంట్ ముందే నవంబర్ చివరి వారం రిలీజ్ లెక్కలన్నీ శర్వాకు అనుకూలంగా మారిపోవడం ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. మొదట నవంబర్ 27న మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా భావించారు.
కానీ అదే రోజు రావాల్సిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'హైందవ' వాయిదా పడగా, రష్మిక మందన్న 'మైసా' కూడా రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 'మైసా' కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా రెండు సినిమాలు వెనక్కి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో 'భోగి' కి థియేటర్ల పరంగా పెద్ద ఊరట లభించింది. ఇదే తేదీన చిన్న సినిమా 'హై' మాత్రమే పోటీలో ఉంది.
అయితే 'భోగి' విడుదల కూడా ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. నవంబర్ 12నే రావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణాలతో నవంబర్ 27కు మారింది. డేట్ షిఫ్ట్ అవ్వడంతో ప్రమోషన్స్ కోసం చిత్రబృందానికి పెద్దగా సమయం దొరకలేదు. ఇప్పుడు పోటీ తగ్గడంతో అదనపు స్క్రీన్లు దక్కే ఛాన్స్ ఉన్నా, థియేటర్లు పెరిగినంత మాత్రాన కలెక్షన్లు రావు. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండాలంటే సాయంత్రం వచ్చే ట్రైలర్ జనాల్లోకి గట్టిగా వెళ్లాలి.
బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ కు ఇప్పుడు ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ చాలా అవసరం. గతంలో 'రన్ రాజా రన్', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'శతమానం భవతి', 'మహానుభావుడు' లాంటి వరుస విజయాలతో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కొంత వెనుకబడ్డారు. సంక్రాంతికి వచ్చిన 'నారీ నారీ నడుమ మురారి' కాస్త ఊరటనిచ్చినా, ఆ తర్వాత రిలీజైన 'బైకర్' నిరాశపరిచింది.
పైగా శర్వానంద్ ఈసారి తన కంఫర్ట్ జోన్ దాటి ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో మెప్పించిన ఆయన, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటించారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శర్వాను పూర్తిస్థాయి మాస్ యాక్షన్ అవతార్ లో ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారన్నది కీలకం.
విడుదలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉండటంతో ఈవెంట్ నుంచే ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నారు. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, నవంబర్ చివరి వారంలో దొరికిన ఈ ఓపెన్ గ్రౌండ్ ను 'భోగి' టీమ్ గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి సంపత్ నంది మార్క్ కమర్షియల్ టేకింగ్ శర్వానంద్ కు మళ్లీ సక్సెస్ ట్రాక్ అందిస్తుందో లేదో చూడాలి.
