నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?
అయితే 'దసరా'లో నాని చేసిన ప్రయోగం సక్సెస్ కావడానికి కేవలం మాస్ గెటప్ ఒక్కటే కారణం కాదు. కథలోని ఎమోషన్స్, సింగరేణి నేపథ్యం కూడా బాగా పనిచేశాయి.
By: M Prashanth | 3 Nov 2026 10:01 AM ISTనాని కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమాను అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. 'దసరా'తో నానిని పూర్తిస్థాయి మాస్ హీరోగా చూపించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు శర్వానంద్‌తో సంపత్ నంది కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే శర్వానంద్‌కు ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ సినిమా లేదు. అటు సంపత్ నంది కూడా దర్శకుడిగా ఆ మార్కును అందుకోలేదు. దీంతో మరో పండగ టైటిల్ 'భోగి' ఇద్దరికీ ఆ లోటును తీర్చే సినిమాగా మారుతుందా అనేది ఆసక్తికరంగా ఉంది.
సంపత్ నంది గతంలో రామ్ చరణ్‌తో 'రచ్చ', రవితేజతో 'బెంగాల్ టైగర్', గోపీచంద్‌తో 'గౌతమ్ నంద', 'సీటీమార్' సినిమాలు చేశారు. స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ వంద కోట్ల క్లబ్‌లోకి మాత్రం అడుగుపెట్టలేకపోయారు. ఇప్పుడు శర్వానంద్‌తో చేస్తున్న 'భోగి' కోసం తన రెగ్యులర్ కమర్షియల్ స్టైల్‌ను పక్కనపెట్టి రా అండ్ రస్టిక్ కథను ఎంచుకున్నారు. 1960ల నాటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
మరోవైపు శర్వానంద్ కెరీర్ కూడా దాదాపు ఇలాగే ఉంది. 'శతమానం భవతి', 'మహానుభావుడు' లాంటి విజయాలు అందుకున్నా వంద కోట్ల మార్కు మాత్రం దూరంగానే ఉంది. గతంలో 'రణరంగం'తో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు 'భోగి'లో గంగ పాత్ర కోసం పూర్తిగా మారిపోయారు. మాస్ గడ్డం, రఫ్ లుక్‌తో ఇప్పటివరకు కనిపించని అవతారంలోకి వచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
అయితే 'దసరా'లో నాని చేసిన ప్రయోగం సక్సెస్ కావడానికి కేవలం మాస్ గెటప్ ఒక్కటే కారణం కాదు. కథలోని ఎమోషన్స్, సింగరేణి నేపథ్యం కూడా బాగా పనిచేశాయి. అదే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్‌లో సాగదీతపై డివైడ్ టాక్స్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ లెక్క మాత్రం తగ్గలేదు. దీంతో 'భోగి'లోనూ యాక్షన్‌తో పాటు కథ ఎంత బలంగా ఉంటుందనేది కీలకం కానుంది. గంగకు తన చెల్లెళ్లతో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ విడుదల చేసిన పాటతో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా చోటిచ్చినట్లు కనిపిస్తోంది.
ఇంకో విషయం ఏంటంటే నాని 'దసరా' చేసే సమయానికి శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడు. కానీ సంపత్ నంది ఇప్పటికే పలు మాస్ సినిమాలు తీసిన అనుభవంతో రంగంలోకి దిగుతున్నారు. పైగా 'భోగి'లో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. త్వరలో 'ది థీమ్ ఆఫ్ గంగ' పేరుతో మూడో పాటను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌లో రస్టిక్ టచ్ బాగానే కనిపిస్తోంది.
నవంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ సాధించడం చిన్న టార్గెట్ కాదు. శర్వానంద్ గత సినిమాల ఓపెనింగ్స్ చూస్తే ఆ మార్కు కోసం మంచి టాక్‌తో పాటు లాంగ్ రన్ కూడా అవసరం. అయితే 'దసరా'తో నాని మార్కెట్‌ను శ్రీకాంత్ ఓదెల పెంచినట్లే, 'భోగి'తో శర్వానంద్ మార్కెట్‌ను సంపత్ నంది పెంచగలరా అనేది చూడాలి.
