Begin typing your search above and press return to search.

సింగర్ గా మారిన 'పోలిశెట్టి'.. సంక్రాంతి రూమర్స్ కు చెక్

సినిమాల గురించి రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ లేకపోతే, ఆ సినిమా వాయిదా పడుతుందేమో అనే అనుమానం అందరికీ వస్తుంది.

By:  M Prashanth   |   25 Nov 2025 5:05 PM IST
సింగర్ గా మారిన పోలిశెట్టి.. సంక్రాంతి రూమర్స్ కు చెక్
X

సినిమాల గురించి రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ లేకపోతే, ఆ సినిమా వాయిదా పడుతుందేమో అనే అనుమానం అందరికీ వస్తుంది. గత కొద్ది రోజులుగా నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. షూటింగ్ లేట్ అవుతోందని, సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నారని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ, మేకర్స్ అదిరిపోయే అప్డేట్ తో ముందుకొచ్చారు.

హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమా వస్తుందంటే నవ్వుల గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈసారి నవీన్ కేవలం నటనతోనే కాదు, తన గొంతుతో కూడా మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'భీమవరం బాల్మ' నవంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ పాటను పాడింది మరెవరో కాదు, స్వయంగా నవీన్ పోలిశెట్టినే.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో వీడియోలో నవీన్ చేసిన హంగామా మామూలుగా లేదు. మంచి నీళ్లు కరెక్ట్ గా 32.5 డిగ్రీల వేడి చేసి, అందులో లవంగం, మృదంగం, చూయింగం కలిపి తాగితే వాయిస్ అద్భుతంగా వస్తుందంటూ నవీన్ చెప్పే డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. "ఈ మధ్య యాక్టర్లు సింగర్లు అయిపోతున్నారు, మరి సింగర్లు యాక్టర్లు అయిపోయారు కదా.. నేను పాడితే తప్పేంటి" అంటూ వేసిన సెటైర్లు పేలాయి. ఈ ఫన్ వీడియోతోనే సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు.

ఈ అప్డేట్ తో మరో కీలక విషయంపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. సినిమా విడుదల తేదీని 2026 జనవరి 14గా మేకర్స్ మరోసారి అధికారికంగా ప్రకటించారు. "పండగకి స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండండి" అంటూ చేసిన ప్రకటనతో, సంక్రాంతి రేసులో రాజు గారి ఎంట్రీ పక్కా అని తేలిపోయింది. దీంతో వాయిదా రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే.. మారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ కు జోడీగా అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు సంగీతం అందిస్తోంది మిక్కీ జె మేయర్. ఆయన మాస్ బీట్స్ కు నవీన్ ఎనర్జీ తోడైతే థియేటర్లో రచ్చ రంభోలానే. మొత్తానికి నవీన్ పోలిశెట్టి చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా, గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యేలా ఉంది. సింగర్ గా నవీన్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే నవంబర్ 27 వరకు ఆగాల్సిందే.