Begin typing your search above and press return to search.

భానుప్రియకు ఏమైంది? ఆమె చెల్లి ఏం చెప్పారంటే?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందిన భానుప్రియ గురించి కొంతకాలంగా వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

By:  M Prashanth   |   5 April 2026 6:00 AM IST
భానుప్రియకు ఏమైంది? ఆమె చెల్లి ఏం చెప్పారంటే?
X

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందిన భానుప్రియ గురించి కొంతకాలంగా వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగోలేదని, మానసిక స్థితి దెబ్బతిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఆమె సోదరి, హీరోయిన్ శాంతిప్రియ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.

భానుప్రియ ప్రస్తుతం కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నది నిజమే కాని, ఆమె మతిస్థిమితం కోల్పోయిందనే ప్రచారం పూర్తిగా అసత్యమని శాంతి ప్రియ చెప్పారు. "అక్కకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా, చివరి నిమిషంలో పాత్రల్లో మార్పులు చేయడం, ముందుగా చెప్పినట్లుగా కాకుండా ప్రవర్తించడం ఆమెను చాలా బాధపెడుతోంది. ఇలాంటి పరిస్థితులు వరుసగా ఎదురవడంతో ఆమె మానసికంగా కలత చెందుతోంది" అని వివరించారు.

సుమారు 280కి పైగా సినిమాల్లో నటించి, అనేక అవార్డులు అందుకున్న భానుప్రియ వంటి సీనియర్ నటి పట్ల అలా వ్యవహరించడం సరైంది కాదని శాంతిప్రియ అభిప్రాయపడ్డారు. "ఎంత గొప్ప కెరీర్ ఉన్నా కూడా, ఇప్పుడు ఆమెను పట్టించుకునే వారు తగ్గిపోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే 80ల స్టార్ల రీయూనియన్లకు కూడా ఆమెను ఆహ్వానించడం లేదు. ఇది చాలా బాధాకరం" అని ఆమె పేర్కొన్నారు.

భానుప్రియ వ్యక్తిగత జీవితంలో కూడా ఎదురైన విషాదం ఆమెను మరింతగా కుంగదీసిందని శాంతిప్రియ వెల్లడించారు. భర్త మరణం తర్వాత ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిందని, బయట కార్యక్రమాలకు హాజరు కావడం కూడా తగ్గించిందని చెప్పారు. ఆ కారణాల వల్లే ఆమె కొంత ఒంటరితనాన్ని అనుభవిస్తుందని తెలిపారు. అలాగే, ఇండస్ట్రీలోని పలువురు ఆమెతో సంప్రదింపులు జరపకపోవడం పట్ల కూడా శాంతిప్రియ అసంతృప్తి వ్యక్తం చేశారు.

"అక్కను నేరుగా సంప్రదించలేకపోతే, కనీసం మా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు. మా అన్నయ్య ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తే. అయినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భానుప్రియ భవిష్యత్తులో సినిమాల్లో నటించే అవకాశాలపై కూడా శాంతిప్రియ స్పష్టత ఇచ్చారు. అక్క ఇకపై సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని చెప్పారు. అయితే తాను మాత్రం తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఇటీవల బ్యాడ్ గర్ల్ సినిమాలో తన కోసం భానుప్రియ డబ్బింగ్ చెప్పిందని కూడా ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై శాంతిప్రియ తీవ్రంగా స్పందించారు. అక్క గురించి అసత్య వార్తలు ప్రచారం చేయడం మానండని, ఎలాంటి నిర్ధరణ లేకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా తప్పంటూ ఫైర్ అయ్యారు. ఏదేమైనా భానుప్రియ ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లకు శాంతిప్రియ చెక్ పెట్టారు. ఆమె మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, పరిస్థితి తీవ్రమేమీ కాదని స్పష్టం చేశారు. అభిమానులు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.