Begin typing your search above and press return to search.

స్టేజ్ పైనే చెంప దెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన నటుడు

ఇటీవల జరిగిన మూవీ ప్రివ్యూ షోలో తన క్యారెక్టర్ పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తుంటే, థియేటర్లో జనాలు నవ్వడం చూసి తనకు అదంతా ఒక కలలా అనిపించిందని అన్నాడు.

By:  M Prashanth   |   6 Aug 2026 9:33 AM IST
స్టేజ్ పైనే చెంప దెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన నటుడు
X

సినిమాల ప్రమోషన్స్ కోసం కొందరు రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు కానీ, ఒక నటుడు ఏకంగా స్టేజ్ మీదే తనను తాను చెంప దెబ్బలు కొట్టుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్న 'హుషారు పిట్టలు' సినిమా ప్రెస్ మీట్ లో ఈ ఊహించని సంఘటన జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడిన నటుడు భాను స్టేజ్ మీద ఎమోషనల్ అవుతూ చేసిన పనులు అక్కడున్న వాళ్లను, మీడియాను సైతం ఆశ్చర్యపరిచాయి.

తన పేరు పుట్ట భాను అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు కూడా పుట్ట భానునే అని అతను మైక్ తీసుకున్న వెంటనే పరిచయం చేసుకున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి అని, తన ఊర్లో థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే కచ్చితంగా ఫస్ట్ షో చూసేవాడినని తన గతాన్ని అందరి ముందు గుర్తు చేసుకున్నాడు. సినిమాలో ఏవైనా కామెడీ సీన్స్ వస్తే సీట్లో కూర్చుని కిచ్చ కిచ్చ అరుస్తూ గోల చేసి ఎంజాయ్ చేసేవాడినని చెప్పాడు.

ఇటీవల జరిగిన మూవీ ప్రివ్యూ షోలో తన క్యారెక్టర్ పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తుంటే, థియేటర్లో జనాలు నవ్వడం చూసి తనకు అదంతా ఒక కలలా అనిపించిందని అన్నాడు. అది కలో నిజమో అర్థం కాక నమ్మలేకపోతున్నానని చెబుతూ, ఒక్కసారిగా లైవ్ లో తన రెండు చెంపల మీద గట్టిగా, వరుసగా లాగి కొట్టుకున్నాడు. గ్యాప్ లేకుండా అతను అలా తనను తాను కొట్టుకోవడంతో ఈవెంట్ లో ఉన్నవాళ్లు కాసేపు స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోయారు.

చెంపలు వాయించుకున్న తర్వాత అతను స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇన్నేళ్ల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సరే సినిమానే ప్రాణంగా బతుకుతున్నానని, ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా తనను తాను కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఏడుస్తూనే చెప్పాడు. ఎంతమంది వద్దన్నా సరే తనను తాను నిరూపించుకుంటానని, తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు.

తనకు సినిమాలో మంచి ఛాన్స్ రావాలని ప్రతి మంగళవారం గుడికి వెళ్లి దేవుడికి మొక్కుకున్నానని, సినిమా రిలీజ్ అయ్యాక వంద కొబ్బరికాయలు కొడతానని వేడుకున్నానని భాను చెప్పాడు. తనకు కొత్త లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ బిక్షు, ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ లకు దేవుడితో సమానంగా మరో వంద కొబ్బరికాయలు ఎక్స్ట్రా కొడతానని చెబుతూ వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాడు.

బిక్షు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ 'హుషారు పిట్టలు' సినిమా లోకల్ ఫ్లేవర్ తో యూత్ ఫుల్ కామెడీ డ్రామాగా రాబోతోంది. కొత్త నటులు అన్ష్, వాసవి గణేశన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీలో కాలేజ్ లైఫ్ తో పాటు స్టూడెంట్స్ ఎదుర్కొనే ఫ్యామిలీ బాధ్యతలు, రియల్ వరల్డ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ను చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.