ముంబైలో ఇటలీ నగరాన్ని నిర్మించిన కళాత్మక దర్శకుడు!
భారీ సెట్లను నిర్మించి కళాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ పనితనం గురించి చెప్పాల్సిన పని లేదు.
By: Sivaji Kontham | 25 Oct 2025 9:15 AM ISTభారీ సెట్లను నిర్మించి కళాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ పనితనం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఇందులో సుదీర్ఘ అనుభవం ఉంది. కేవలం సెట్ల నిర్మాణం కోసం ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేయిస్తున్నారు. దేవదాస్, రామ్ లీల, పద్మావత్ , గంగూబాయి కథియావాడి వంటి కళాఖండాల కోసం భన్సాలీ నేతృత్వంలో భారీ సెట్లను నిర్మించిన సంగతి తెలిసిందే. సెట్ డిజైన్లకు గొప్ప పేరొచ్చింది.
ఇప్పుడు ముంబై స్టూడియోలో `లవ్ అండ్ వార్` కోసం ఇటలీని పునఃసృష్టిస్తున్నారు. అంతర్జాతీయ షూటింగ్ ను రద్దు చేయాల్సి రావడంతో ప్లాన్ ముంబైకి షిఫ్టయింది. యూరోపియన్ వాతావరణాన్ని ముంబైకి తీసుకురావడం కోసం భన్సాలీ సెట్ డిజైనర్ తో కలిసి చాలా శ్రమించారు. 1970ల నాటి ఇటాలియన్ రూపాన్ని తెచ్చేందుకు భన్సాలీ టీమ్ చాలా వర్క్ చేసిందని తెలిసింది. మొదట ఇటలీలో 45 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసిన భన్సాలీ సమయం సరిపోకపోవడం, ఇతర లాజిస్టిక్ పరిమితుల కారణంగా విదేశీ షెడ్యూల్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
అటుపై ముంబై గోరేగావ్‌లోని రాయల్ పామ్స్ సమీపంలోని ఒక ఖరీదైన స్టూడియోలో ఇటలీని సెట్లలో నిర్మించారు. ఆ కాలం నాటి గొప్ప అలంకరణ, వాతావరణంతో కూడిన ఇటాలియన్ క్లబ్‌ను ఏర్పాటు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని తెలిసింది. భన్సాలీకి నచ్చిన విధంగా రాజీ లేకుండా దీనిని నిర్మించారు. నిర్మాణ సంస్థకు దగ్గరగా ఉన్న ఒక సోర్స్ ప్రకారం.. ముంబైలో స్థానికంగా షూటింగ్ చేయాలనే నిర్ణయంతో ఇదంతా మొదలైంది. దీపావళికి ముందు.. ముంబైలో వేసిన సెట్లలో పది రోజుల షెడ్యూల్ కూడా పూర్తి చేసారు. తదుపరి మరిన్ని భారీ వార్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది.
లవ్ & వార్‌లో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రధారులు. ప్రేమ, ప్రేమికుల మధ్య సంఘర్షణ, దేశాల మధ్య వార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో `వార్ డ్రామా` మరో లెవల్ లో భావోద్వేగానికి గురి చేస్తుందని టాక్ వినిపిస్తోంది. భన్సాలీ రాజీ అన్నదే లేకుండా ఈ చిత్రాన్ని మరో కళాఖండంగా తీర్చిదిద్దుతున్నారని తెలిసింది.
