Begin typing your search above and press return to search.

టైప్‌కాస్ట్‌పై భయం లేదు.. ఏ పాత్రనైనా మెప్పించగలను!

ఇటీవల కాలంలో భాగ్యశ్రీ బోర్సే ఎంచుకున్న ప్రాజెక్టులు అమ్మ‌డి నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాయి.

By:  Srikanth Kontham   |   15 Oct 2026 12:00 AM IST
టైప్‌కాస్ట్‌పై భయం లేదు.. ఏ పాత్రనైనా మెప్పించగలను!
X

యంగ్ అండ్ హాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. ఆరంభంలో ప్లాపుల ఎదురైనా? ఆ త‌ప్ప‌ట‌డుగుల నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా భాగ్య శ్రీ ఓ ఇంట ర్వ్యూలో నటన.. పాత్రల ఎంపిక ..చిత్ర పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఒకే రకమైన పాత్రలకే పరిమితం (టైప్‌కాస్ట్) అయిపోతాననే భయం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

`ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. ఒక నటిగా సరికొత్త పాత్రలను ప్రయత్నిస్తూ నిరంతరం ఎదగడమే నా ప్రధాన లక్ష్యం. ఒకే తరహా పాత్రలు చేస్తాననే భయం నాలో లేదు. ఎందుకంటే ఎలాంటి విభిన్నమైన క్యారెక్టర్‌నైనా స్వీకరించి.. దానికి పూర్తి న్యాయం చేయగలననే నమ్మకం , ఆత్మవిశ్వాసం నాకు ఉన్నాయి` అని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో భాగ్యశ్రీ బోర్సే ఎంచుకున్న ప్రాజెక్టులు అమ్మ‌డి నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం `కాంత`లో కుమారిగా అలరించిన సొగ‌స‌రి గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించారు. విభిన్న నేపథ్యాలు ఉన్న పాత్రల్లో ఒదిగిపోతూ నటిగా తనలోని విభిన్న ప్రతిభను బయటకు తీయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.

హిందీలో `యారియాన్ 2`, `చందు ఛాంపియన్` చిత్రాల్లో చిన్న పాత్రల ద్వారా వెండితెరకు పరిచయమైన భాగ్యశ్రీ రవితేజ సరసన `మిస్టర్ బచ్చన్` సినిమాతో సౌత్‌లో కథానాయికగా అడుగుపెట్టారు. అటుపై మ‌రికొన్ని సినిమాల‌తో పాటు రామ్ పోతినేని స‌ర‌స‌న `ఆంధ్ర కింగ్ తాలూకా` చిత్రంలో నటనకు మంచి గుర్తింపు లభించింది. అనంత‌రం `లెనిన్` తో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ విజ‌యాల‌తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా సైమా ఉత్తమ డెబ్యూటి నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే దక్షిణాది వ్యాప్తంగా విభిన్నమైన భాషల్లో బిజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సరసన `ఆపరేషన్ గంగ` అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో మలయాళంలోకి కూడా అడుగు పెడుతున్నారు. త‌మిళ్ లో సూర్య స‌ర‌స‌న సేయాన్ లో న‌టిస్తున్నారు. ఇలా గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంతో చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవచ్చని భావిస్తున్నారు.