`లెనిన్` బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే క్యూట్ స్పీచ్‌కి తిరుపతి షేక్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మించిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం `లెనిన్`.
By: Sivaji Kontham | 6 July 2026 9:37 AM ISTసితార ఎంటర్‌టైన్‌మెంట్స్- మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మించిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం `లెనిన్`. అఖిల్ అక్కినేని- భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు (నందు) దర్శకత్వం వహించారు. జూలై 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలవుతోంది. చిత్రబృందం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, అఖిల్ సినిమా విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేయగా, చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే క్యూట్ తెలుగు స్పీచ్ తిరుపతిని షేక్ చేసింది. ``తిరుపతి... ట్రైలర్ నచ్చిందా?`` అంటూ భాగ్యశ్రీ ప్రశ్నించడం అభిమానులందరినీ విశేషంగా అలరించింది.
భాగ్యశ్రీ బోర్సే స్టేజ్ పైకి రాగానే మైక్ అందుకుని ఎంతో ఎనర్జిటిక్‌గా ``తిరుపతి.. ఎలా ఉన్నారు?`` అంటూ అక్కడ గుమికూడిన భారీ జనసందోహాన్ని పలకరించిన తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమా ట్రైలర్ గురించి స్పందిస్తూ.. ``ట్రైలర్ నచ్చిందా? నచ్చిందా?`` అని అభిమానులను అడిగారు. దానికి ప్రేక్షకుల నుండి థియేటర్ ఊగిపోయేలా.. భారీ కేకలతో రెస్పాన్స్ రావడంతో.. ఎంతో మురిసిపోతూ ``ఓ అయితే అదరగొట్టేసింది అన్నమాట`` అని భాగ్యశ్రీ అచ్చ తెలుగులో మాట్లాడుతూ అభిమానుల్లో జోష్ పెంచారు. స్టేజ్ పైన ఉన్న ఈ ఉత్తరాది భామను తెలుగు ప్రేక్షకులు తమ సొంత అమ్మాయిలా అంగీకరించి.. ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇంకా తెలుగు నేర్చుకుంటున్నానని నవ్వుతూ చెప్పడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
ఈ సినిమాలో తను పోషించిన పాత్ర గురించి భాగ్యశ్రీ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. `లెనిన్` చిత్రంలో తను `భారతి` అనే అద్భుతమైన పాత్రను పోషించానని వెల్లడించారు. ఆ పేరు వినగానే ఒక విభిన్నమైన అనుభూతి.. ఒక ఎమోషన్... ఒక గొప్ప ప్రయాణం గుర్తొస్తాయని చెప్పారు. ఇలాంటి నటనకు ప్రాధాన్యమున్న గొప్ప పాత్రను తనకు ఇచ్చిన దర్శక- నిర్మాతలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రల్లో `భారతి` అనే పాత్ర ఎప్పటికీ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానిస్తూ భాగ్యశ్రీ ఉద్వేగానికి లోనయ్యారు.
చిత్ర యూనిట్, సహ నటీనటులపైనా భాగ్యశ్రీ తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అక్కినేని నాగార్జున గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ పాత్రతో నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఈ మూవీ కోసం హీరో అఖిల్ అక్కినేని ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. షూటింగ్ సమయంలో ఒక టీంగా కలిసి పని చేద్దామని అఖిల్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక బ్యానర్లు అయిన అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఇలా తన అందమైన తెలుగు మాటలతో అందరి హృదయాలను గెలుచుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రసంగం ఆద్యంతం యూత్ ని ఉర్రూతలూగించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ మన్మధుడు, అక్కినేని నాగార్జునను `మన కింగ్` అంటూ ఎంతో ఉత్సాహంగా.. ప్రేక్షకుల చప్పట్లు.. ఈలల మధ్య పిలిచారు. భాగ్యశ్రీ ఈ క్యూట్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమే కాకుండా.. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న `లెనిన్` సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అనుష్క, నివేద థామస్ తర్వాత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేందుకు మహారాష్ట్ర ఔరంగాబాద్ కి చెందిన నటి భాగ్యశ్రీ ప్రయత్నిస్తుండటం తన పట్టుదలకు నిదర్శనంగా భావించవచ్చు.
