Begin typing your search above and press return to search.

ఈ మాత్రం 'భాగ్యం' చాలునా?

అక్కడి క్రిటిక్స్ కూడా జడ్జిమెంట్ కోల్పోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ మోస్తరు సినిమాలను కూడా వాటి స్థాయికి మించి పొగడ్డం వాళ్లకు అలవాటైపోయింది.

By:  Garuda Media   |   14 Nov 2025 8:00 PM IST
ఈ మాత్రం భాగ్యం చాలునా?
X

కెరీర్ ఆరంభంలో అవకాశాలు రావడం ఒకెత్తయితే.. అవి సద్వినియోగం కావడం ఇంకో ఎత్తు. తొలి చిత్రం విడుదల కాకముందే తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయినందుకు సంతోషించాలో.. వరుసగా ఫ్లాపులే ఎదురవుతున్నందుకు బాధ పడాలో అర్థం కాని స్థితిలో ఉంది భాగ్యశ్రీ బోర్సే. ఆమె గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రోమోల్లో భలే హైలైట్ అయింది భాగ్యశ్రీ. సినిమా విడుదల కావడానికి ముందే ఆమెకు మంచి హైప్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం? ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది తన నెక్స్ట్ రిలీజ్ ‘కింగ్డమ్’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. పైగా అందులో తనది లిమిటెడ్ రోల్ కావడంతో జనం దృష్టిలో పడనే లేదు.

ఇప్పుడిక నవంబరు నెల మీద గంపెడాశలతో నిలిచింది భాగ్యశ్రీ. తన రెండు కొత్త సినిమాలు కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా ఈ నెల రిలీజ్‌కే షెడ్యూల్ అయ్యాయి. అందులో ముందుగా ‘కాంత’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రెండు రోజుల ముందే తమిళంలో ప్రిమియర్స్ వేశారు. అక్కడి నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ఆహా ఓహో అంటూ పొగిడేశారు. కానీ తమిళ సినిమాల క్వాలిటీ గత కొన్నేళ్లలో బాగా పడిపోయింది.

అక్కడి క్రిటిక్స్ కూడా జడ్జిమెంట్ కోల్పోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ మోస్తరు సినిమాలను కూడా వాటి స్థాయికి మించి పొగడ్డం వాళ్లకు అలవాటైపోయింది. అందుకే ‘కాంత’ విషయంలో అనుమానాలు కలిగాయి. తెలుగు ప్రిమియర్స్ పడ్డాక ఆ సందేహాలు నిజమే అని తేలిపోయింది. ‘కాంత’ ఒక భిన్నమైన, మంచి ప్రయత్నమే కానీ.. ఇది జనరంజకమైన సినిమా మాత్రం కాదు. మన దగ్గర యావరేజ్ రివ్యూలే వచ్చాయి. టాక్ కూడా అలాగే ఉంది. కానీ సినిమాలో ప్రధాన పాత్రధారుల నటన మాత్రం అదిరిపోయింది.

దుల్కర్, సముద్రఖని గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పెర్ఫామర్ల ముందు నిలబడి మెప్పించడం తేలిక కాదు. ఆ విషయంలో భాగ్యశ్రీ సక్సెస్ అయింది. 1950 నాటి కథానాయికగా లుక్, నటనతో మెప్పించడం సవాలే. ఏమాత్రం తేడా కొట్టినా పాత్ర చెడిపోతుంది. భాగ్యశ్రీ ఆ పాత్రకు మిస్ ఫిట్ అనిపించకపోవడమే ఆమె సాధించిన పెద్ద సక్సెస్. తన అందం, అభినయంతో ఆమె ఆకట్టుకుంది. తొలి రెండు సినిమాల్లో ఆమెలోని పెర్ఫామర్‌ను దర్శకులు సరిగా వాడుకోలేకపోయారన్నది వాస్తవం. కానీ ఈ చిత్రంలో సెల్వమణి మాత్రం తనను బాగా ప్రెజెంట్ చేశాడు. అంతిమంగా ‘కాంత’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. భాగ్యశ్రీకి మాత్రం ఈ చిత్రం ప్లస్సవుతుందనడంలో సందేహం లేదు.