తిరువీర్ 'భగవంతుడు'.. టీజర్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు.
By: M Prashanth | 30 Jan 2026 7:05 PM ISTటాలీవుడ్ యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆ పీరియడ్ రూరల్ డ్రామాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ మూవీ టీజర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టీజర్ లో చూపించిన విజువల్స్, భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
టీజర్ ప్రారంభంలో వినిపించే వాయిస్ ఓవర్ కథకు పునాది వేస్తుంది. "ఈ భూమిపై రెండు రకాల కథలు జరుగుతాయి.. ఒకటి మనుషులు దేవుళ్లుగా మారడం, మరొకటి దేవుళ్లు మనుషుల మధ్య జీవించడం" అనే డైలాగ్ తో ఆసక్తి పెంచారు మేకర్స్. ఆ తర్వాత హీరో తిరువీర్ పాత్రను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టు ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచాయి.
హీరో-హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ కూడా టీజర్ లో చూపించారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా కనిపిస్తూ కథలో ఎమోషన్ ను యాడ్ చేసింది. ఆమె, తిరువీర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. మరోవైపు విలన్ గా రిషి నాగరాజు ఎంట్రీ ఇస్తూ కథలో ఇంటెన్స్ పెంచారు. హీరో- విలన్ మధ్య సాగే గొడవలు క్రమంగా వయోలెన్స్ కు దారి తీసేలా చూపించడం ఆసక్తిని రెట్టింపు చేసింది.
యాక్షన్ సన్నివేశాలు, గ్రామీణ వాతావరణం, న్యాచురల్ సెట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి ఫ్రేమ్ లో రియాలిటీ కనిపించేలా చిత్రీకరించారు. తిరువీర్ ఇప్పటికే మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు సినిమాలో మరింత పవర్ ఫుల్, ఎమోషన్స్ తో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు.
చిత్రానికి జీజీ విహారి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారనే భావన టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. నిర్మాతగా బిజినెస్ మ్యాన్ రవి పనస సినీ రంగంలోకి అడుగుపెడుతూ రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దివంగత పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో సినిమా రూపొందడం ప్రత్యేకతను సంతరించుకుంది.
సాంకేతిక విభాగం కూడా సినిమాకి స్ట్రాంగ్ గా నిలుస్తోంది. కేపీ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాకు మరింత క్వాలిటీ తీసుకువచ్చాయి. కాలకేయ ప్రభాకర్, రవీంద్ర విజయ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకసారి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి భగవంతుడు టీజర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తూ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పాలి.
