Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్ మార్కెట్లో 'ఇరుముడి' వెన‌క‌బాటుకు కార‌ణం?

ప్ర‌యోగాత్మ‌క క‌థాంశం.. అత్యంత భారీత‌నం .. అసాధార‌ణ విజువ‌ల్ గ్రాండియారిటీ.. విప‌రీత‌మైన పంచ్ డైలాగులు.. ప్ర‌తి పావు గంట‌కు భీక‌ర‌మైన యాక్ష‌న్ బ్లాక్ లు.. అద్భుత‌మైన ఇంట‌ర్వెల్ బ్యాంగ్.. ఊహాతీత‌మైన ట్విస్టులు ..

By:  Sivaji Kontham   |   16 Sept 2026 9:19 AM IST
ఓవ‌ర్సీస్ మార్కెట్లో ఇరుముడి వెన‌క‌బాటుకు కార‌ణం?
X

ప్ర‌యోగాత్మ‌క క‌థాంశం.. అత్యంత భారీత‌నం .. అసాధార‌ణ విజువ‌ల్ గ్రాండియారిటీ.. విప‌రీత‌మైన పంచ్ డైలాగులు.. ప్ర‌తి పావు గంట‌కు భీక‌ర‌మైన యాక్ష‌న్ బ్లాక్ లు.. అద్భుత‌మైన ఇంట‌ర్వెల్ బ్యాంగ్.. ఊహాతీత‌మైన ట్విస్టులు .. ఇవేవీ అవ‌స‌రం లేకుండానే.. ఓ రెండు సినిమాలు ఈ సీజ‌న్‌లో విడుదలై అద్భుత ఫ‌లితాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారిందా? అనేంత‌గా అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు ఈ రెండు సినిమాల ఫ‌లితాలను చూసాక‌..

2026 ఆగస్టు 21న ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగిన మాస్ మ‌హారాజా ర‌వితేజ `ఇరుముడి`, మ‌ల‌యాళ హీరో నివిన్ పాళీ న‌టించిన `బెత్లెహామ్ కుటుంబ యూనిట్` చిత్రాలు రెండు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దేశీయ మార్కెట్‌లో ఈ రెండు సినిమాలు భారీ ఫుట్‌ఫాల్స్‌తో థియేటర్లలో దుమ్మురేపాయి. అయితే 25 రోజుల ప్రదర్శన ముగిసేసరికి ప్రపంచవ్యాప్త వసూళ్లలో ఒక ఆసక్తికరమైన - స్పష్టమైన తేడా కనిపించింది.

దేశీయంగా చూస్తే `ఇరుముడి` చిత్రానికే కాస్త ఎక్కువ ఫుట్‌ఫాల్స్ నమోదయ్యాయి. సింగిల్ స్క్రీన్లు, మాస్ సెంటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో లోకల్ మార్కెట్‌లో ఈ చిత్రం తిరుగులేని ఆధిపత్యం చూపించింది. అయితే ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ రేసులో `బెత్లెహామ్ కుటుంబ యూనిట్` కేవలం 25 రోజుల్లోనే 300 కోట్ల మైలురాయిని దాటగా, `ఇరుముడి` 235 కోట్ల గ్రాస్ వసూళ్ల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది.

ఈ కలెక్షన్ల అంతరానికి ప్రధాన కారణం ఓవర్‌సీస్ మార్కెట్‌లోని ప్రదర్శన తీరేనని ట్రేడ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. `బెత్లెహామ్ కుటుంబ యూనిట్` ఒక్క విదేశీ మార్కెట్ నుంచే ఏకంగా 14 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా రాబట్టగలిగింది. మరోవైపు `ఇరుముడి` చిత్రం దేశీయంగా ఉన్న భారీ జోరును విదేశాల్లో ఆ స్థాయిలో కొనసాగించలేక కేవలం 2.5 మిలియన్ డాల‌ర్ల‌ లోపే పరిమితమైంది. నిజానికి ఓవ‌ర్సీస్ లో ర‌వితేజ మార్కెట్ రేంజు పెరిగినా కానీ, ఇది బెత్ల‌హామ్ క‌లెక్ష‌న్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తోంది.

విదేశీ వసూళ్లలో కనిపించిన ఈ సుమారు 11.5 మిలియన్ డాల‌ర్ల‌ భారీ అంతరమే `బెత్లెహామ్..`ను 300 కోట్ల ఎలైట్ క్లబ్‌లో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. లోకల్ మార్కెట్‌లో సమానమైన క్రేజ్ .. ఆదరణ ఉన్నా ఓవర్‌సీస్ కలెక్షన్లలో వెనుకబడటం వల్ల `ఇరుముడి` ఆ మార్కును అందుకోలేకపోయింది. దీనివల్ల విదేశీ బాక్సాఫీస్ వద్ద సినిమాల వీక్షణలో ప్రాంతీయ చిత్రాల జోరు.. ఓవర్‌సీస్ మార్కెట్ వ్యూహాలు ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ మరోసారి నిరూపించింది.