ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ డైరెక్టర్లలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే రాసే డైరెక్టర్స్ వీళ్లేనా..?
ఈ సీన్ లో కుర్రాడు చోటు 15 నిమిషాలు ముందు టైమ్ కలుపుతాడు అనేది సెటప్ అయితే దానికి పబ్ లో పే ఆఫ్ ఇచ్చాడు.
By: Gopi Velupala | 4 Oct 2026 9:55 AM ISTప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరైతే విభిన్న తరహాలో ఆలోచిస్తూ స్క్రిప్ట్ ని రాసుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలైతే వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది దర్శకులు డిఫరెంట్ వే లో సినిమాలను చేసే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో చాలా వరకు వైవిధ్యాన్ని చూపిస్తే ఆయా దర్శకులకు గొప్ప గుర్తింపైతే వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఈ జనరేషన్ దర్శకులలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే ను రాసే దర్శకులు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం...
వివేక్ ఆత్రేయ
డిఫరెంట్ స్క్రీన్ ప్లే ని రాయడంలో వివేక్ ఆత్రేయకి చాలా మంచి పేరైతే ఉంది. 'బ్రోచేవారేవరురా' సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ను రాశాడు. అలాగే ఆర్గానిక్ కామెడీని యాడ్ చేస్తూ ఫ్లో ఎక్కడా మిస్ అవ్వకుండా రెండు మూడు ఫ్లాట్స్ ను సైతం ఒకే లేయర్లో కలిపాడు. అయినప్పటికీ ప్రేక్షకుడికి ఎక్కడ కన్ఫ్యూజన్ రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే క్లియర్ కట్ విజన్ తో సినిమాను చూపించగలిగే కెపాసిటీ ఉన్న స్క్రీన్ ప్లే రైటర్ వివేక్ ఆత్రేయ... ఆయన సినిమాల్లో కామెడీ పాత్రలతోనే సినిమాలోని కాన్ఫ్లిక్ట్ ను ముందుకు నడిపిస్తుంటాడు. ఎక్కడా కూడా సినిమా డౌన్ అయ్యే పొజిషన్ అయితే తీసుకురాడు. ప్రతి క్యారెక్టర్ కి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేసి ఒకవేళ మూవీ ఎక్కడైన డల్ అయి పొజిషన్ కనిపిస్తే అక్కడ ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. దానివల్ల సినిమా ఓవరాల్ ఫ్లో మొత్తం ఒకే పాటర్న్ లో సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మనకు ఎక్కడ కూడా డల్ అయినట్టుగా అనిపించదు...
బ్రోచేవారెవరురా సినిమా లో ఆయన పర్ఫెక్ట్ టెంప్లేట్ ను మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా సీన్స్ డల్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఇక 'అంటే సుందరానికి' సినిమాలో కూడా కామెడీని బేస్ చేసుకొని స్క్రీన్ ప్లే ను ముందుకు నడిపించాడు. దాంతోపాటుగా 'సరిపోదా శనివారం' సినిమాలో పర్ఫెక్ట్ గా ఒక సీన్ కి సెటప్ రాసుకొని దానికి అందరు కన్విన్స్ అయ్యేలా పే ఆఫ్ ఇచ్చాడు.
అసలు సెటప్, పే ఆఫ్ అంటే ఏంటంటే సినిమాలో 20 వ సీన్ లో చూపించే ఆ సీన్ తాలుకు ఇంటెన్షన్ ను దాని కంటే ముందు వచ్చే సన్నివేశాల్లోనే చూపించాలి. దీనిని మనం ఒక ఉదాహరణతో తెలుసుకుందాం...
'సరిపోదా శనివారం' సినిమాలో హీరో వాళ్ల అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం వారం మొత్తం తనకి ఎంత మంది మీద కోపం వచ్చినా కూడా వాళ్ళందరి పేర్లు డైరీలో రాసి పెట్టుకొని కేవలం శనివారం మాత్రమే వాళ్ళను కొడతాడు. అంటే తన కోపాన్ని ఆ ఒక్క రోజు మాత్రమే తీర్చుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే సినిమాలో చోటు అనే ఒక కుర్రాడు ఒక 15 నిమిషాలు ఇంటికి లేటు గా వెళ్లినందుకు వాళ్ల అమ్మ చనిపోయింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురవుతాడు. అప్పటి నుంచి చోటు వాడు పని చేస్తున్న ప్రతి చోట టైమ్ ను ఒక 15 నిమిషాలు ముందుకు కలుపుతుంటాడు. చోటు అలా ఎందుకు కలుపుతాడంటే తనకి జరిగినట్టుగా 15 నిమిషాలు ఇంటికి లేటు గా వెళ్ళి ఇంకెవరూ వాళ్ళ అమ్మని కోల్పోవద్దని అలా చేస్తాడు. ఆ కుర్రాడు అలా 15 నిమిషాలు ముందుకు కలపడం తో వాడు పని చేస్తున్న ఓనర్ కోపానికి వచ్చి ఆ టైమ్ అలా ముందు ఉండటం వల్ల పనులన్నీ టైమ్ కి అవ్వడం లేదని వాన్ని తిట్టి సరైన టైమ్ కలుపుతుంటాడు. కానీ ఓనర్ కి తెలియకుండా ఆ కుర్రాడు మళ్ళీ 15 నిమిషాలు ముందు కలుపుతూనే ఉంటాడు. ఇలా ఓనర్ ఎన్ని సార్లు సెట్ టైమ్ చేసిన చోటు మళ్ళీ ఆ టైమ్ ను మార్చుతుంటాడు. దాంతో విసిగిపోయిన ఓనర్ వాన్ని పని నుంచి తీసేస్తాడు. దాంతో ఆ కుర్రాడు పని పోయిందని బాధపడుతుంటే నాని వాడి బాధను అర్థం చేసుకొని వాన్ని పనిలో చేర్చుకొమ్మని ఓనర్ ను అడుగుతాడు. కానీ ఓనర్ మాత్రం వాడి వల్ల తను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో నాని కి వివరించి చెబుతాడు. దాంతో ఆ కుర్రాడు సైతం నేను వేరే పని చూసుకుంటాను కానీ మా అమ్మ 15 నిమిషాలు లేటు గా వెళ్ళడం వల్ల చనిపోయింది. కాబట్టి ఇంకెవరికి అలా కాకూడదు అందుకని నేను పని చేసిన ప్రతి చోట 15 నిమిషాలు టైమ్ ను ముందుకు కలుపుతూనే ఉంటానని చెబుతాడు... ఒక రకం గా చెప్పాలంటే తర్వాత జరగబోయే సీన్ కి దర్శకుడు ఇక్కడ సెటప్ రాసుకున్నాడు...
ఇక హీరో శనివారం ఒక్కరోజు మాత్రమే అందరినీ కొడుతుంటాడు. కాబట్టి తనకి కోపం తెప్పించిన పోలీస్ ఆఫీసర్ ఎస్ జే సూర్య ను కొట్టాలనుకుంటాడు. ఒక శనివారం నైట్ పబ్ లో పోలీస్ ఆఫీసర్ ను కొట్టడానికి స్కెచ్ వేస్తాడు. అక్కడ టైమ్ చూస్తే 12 అవ్వడానికి మరో 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. అంటే ఆ పబ్ లో టైమ్ 11:45 నిమిషాలు అవుతుంది. మరో 15 నిమిషాలైతే శనివారం ముగిసి ఆదివారం వస్తుందన్న మాట. ఇక హీరో తీసుకున్న ప్రామిస్ ప్రకారం 12 అయితే ఆదివారం వస్తుంది కాబట్టి ఆయన అప్పుడు ఎవరిని కొట్టడు. అదే సమయంలో అక్కడున్న రౌడీలందరిని కొట్టి ఎస్ జే సూర్య దగ్గరికి వెళ్ళాలనుకున్న సమయంలోనే టైమ్ 12 అయినట్టుగా చూపిస్తుంది. దాంతో ఎస్ జే సూర్య ను కొట్టాలనుకున్న నాని వద్దని విరమించుకుంటాడు. నాని ఒకరకంగా వాన్ని కొట్టలేకపోయాననే డిసపాయింట్ మెంట్ లో ఉండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ చోటు వెయిటర్ గా పని చేస్తు కనిపిస్తాడు. వెంటనే నాని ఎస్ జే సూర్య ను కొడతాడు. కారణమేంటంటే చోటు అక్కడ ఉన్నాడు అంటే టైమ్ ను 15 నిమిషాలు ముందు కలిపి ఉంటాడు కదా అందుకే నాని 12 అవ్వడానికి ఇంకా 15 నిమిషాల టైమ్ ఉందని అర్థం చేసుకొని ఎస్ జే సూర్య ను కొడతాడు...
ఈ సీన్ లో కుర్రాడు చోటు 15 నిమిషాలు ముందు టైమ్ కలుపుతాడు అనేది సెటప్ అయితే దానికి పబ్ లో పే ఆఫ్ ఇచ్చాడు. ఈ సీన్ లో మొదట ఎస్ జే సూర్య ను కొట్టలేకపోయినందుకు ముందు హీరో డిసపాయింట్ అయినప్పుడు ప్రేక్షకుడు కూడా డల్ అవుతాడు. కానీ ఒక్కసారి గా చోటు కనిపించే సరికి ప్రేక్షకుడు కూడా ఒక హై ఫీల్ కి లోనవుతాడు... ఒక విషయాన్ని మనం పెర్ఫెక్ట్ గా చెప్పాలంటే దానికి ముందుగానే ఇలా సెటప్ వేసి పెట్టాలి. ఆ తర్వాత దానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇవ్వాలి... ఒకరకంగా ఇలాంటి వాటిని వాడుతూ స్క్రీన్ ప్లే రాస్తే అది బెస్ట్ స్క్రీన్ ప్లే గా నిలుస్తుంది... వీటన్నింటిని మిళితం చేసి స్క్రీన్ ప్లే ను రాస్తాడు కాబట్టే ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో వివేక్ ఆత్రేయ ను బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా చెప్పవచ్చు...
తరుణ్ భాస్కర్
పెళ్లిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఆర్గానిక్ కామెడీని జనరేట్ చేస్తూనే నాచురాలిటీని ఎక్కడ పోగొట్టకుండా తెలంగాణ నేటివిటికి తగ్గట్టుగా డైలాగులను రాసుకొని ప్రేక్షకులను అలరించాడు. ఒకరకంగా ఈ సినిమాలోని పాయింట్ చిన్నదే అయినప్పటికీ దాన్ని తన స్క్రీన్ ప్లే తో ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ముందుకు నడిపించాడు. నిజానికి తరుణ్ భాస్కర్ కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడే అయినప్పటికీ ఆయన నటన మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల తన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ అతని నుంచి సినిమాలు వస్తే ప్రేక్షకులను ఈజీగా ఎంగేజ్ చేయగలుగుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...
