2025:ఒక్కో భాషలో ఒక్కో మూవీ టాప్!
2025 ఇండియన్ సినిమాకు అత్యంత బాగా కలిసి వచ్చిన ఇయర్. ఒక్క మాటలో చెప్పలంటే రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది.
By: Tupaki Entertainment Desk | 31 Dec 2025 7:39 PM IST2025 ఇండియన్ సినిమాకు అత్యంత బాగా కలిసి వచ్చిన ఇయర్. ఒక్క మాటలో చెప్పలంటే రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది. క్రేజీ స్టార్, బిగ్ బడ్జెట్ సినిమాలకు భిన్నంగా చిన్న సినిమాలు ఈ ఏడాది మంచి ఫలితాలని సాధించాయి. ఎప్పుడూ భారీ, కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రభావాన్ని చూపించే తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలకు ఈ ఏడాది తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ మూడు భాషల్లో విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయినా ఒక్కో భాషలో ఒక్కో సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
మలయాళ ఇండస్ట్రీలో లేడీ ప్రధానంగా నటించిన `లోక చాప్టర్ 1 చంద్ర` భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లని రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా రికార్డు సాధించింది. ఇదే సమయంలో గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు ఈ సంవత్సరం పునరుజ్జీవాన్ని అందించింది అని చెప్పొచ్చు. ఈ ఏడాది చావా, సైయారా, తేరే ఇష్క్ మే, `ధురంధర్` వంటి వరుస విజయాలతో బాలీవుడ్ కు నూతనోత్తేజాన్ని అందించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో విధ భాషల్లో ఏ ఏ సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచిందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ రేసులో బాలీవుడ్ సినిమా `ధురంధర్` ముందు వరుసలో నిలిచింది. గత కొంత కాలంగా సాలీడ్ బ్లాక్ బస్టర్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, స్టార్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ `ధురంధర్` మూవీతో క్లాసిక్ బ్లాక్ బస్టర్‌ని అందించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ర్యాంపేజ్‌ని కొనసాగిస్తూ కల్ట్ క్లాసిక్ మూవీగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్‌ఖన్నా, అర్జున్ రాంపల్, మాధవన్, సారా అర్జున్ ఇందులో నటించలేదు జీవించారు. అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ఔట్ స్టాండింగ్. సినిమాతో పాటు ఆయన క్యారెక్టర్ చాలా ఏళ్లు సినీ లవర్స్‌ని వెంటాడుతుంది.
ఇక టాలీవుడ్‌లో టాప్ అనిపించుకున్న మూవీ `కుబేర`. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. దేవ పాత్రలో బిచ్చగాడుగా ధనుష్ పలికించిన హావభావాలు అతని కెరీర్ అత్యుత్తమ నటనకు నిదర్శనం. ఇక దీపక్ క్యారెక్టర్‌లో నాగ్ పోషించిన పాత్ర, తన నటన అద్భుతం అని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టుగా శేఖర్ కమ్ముల స్క్రీన్‌ప్లే, చైతన్య పింగలి మనసుకి హత్తుకునే డైలాగ్స్ ఈ మూవీని 2025లో విడుదలైన సినిమాల్లో టాప్‌లో నిలబెట్టాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల గత చిత్రాల స్థాయికి మించి సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగిన ఈ సినిమాలోని ప్రతి పాత్ర బలమైన ప్రభావాన్ని చూపించింది. నాగ్ తనలోని నటనని బయటికి తీసిన సినిమా ఇది.
తమిళంలో శశికుమార్ నటించిన ఈ మూవీ చిన్న సినిమాగా విడుదలై మౌత్ టాక్‌తో ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. స్టార్స్ సినిమాలు పోటీపడుతున్న నేపథ్యంలో సైలెంట్‌గా విడుదలై మౌత్ టాక్‌తో, సున్నితమైన భావోద్వేగాలతో రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న తమిళ సినిమాగా నిలిచింది. అభిషన్ జీవింత్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి ప్రశంసల్ని సొంతం చేసుకోవడం విశేషం.
మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది `లోక చాప్టర్ 1 చంద్ర మూవీతో భారతీయ సినిమాల్లోనే సరికొత్త ఫీట్‌ని క్రియేట్ చేసింది. కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీగా రూపొందిన ఈ సినిమా మౌత్ టాక్‌తో 20 రోజులు హౌస్ ఫుల్ టాక్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. సూపర్ హీరో సినిమాల్లో సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ మూవీ క్రియేట్ చేసిన క్రేజ్‌తో చాప్టర్ 2పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నిరుత్సాహపరిచింది. అయితే వృషభ్ శెట్టి `కాంతార చాప్టర్ 1`తో మాత్రం వార్తల్లో నిలిచింది. ప్రీక్వెల్స్ కొన్ని మాత్రమే సక్సెస్ సాధించిన నేపథ్యంలో `కాంతార`కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా హిట్ అనిపించుకుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రీక్వెల్‌పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి మించి డివోషనల్ టచ్‌తో వృషభ్ శెట్టి చేసిన ఈ మూవీ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. క్లైమాక్స్‌తో కట్టిపడేసి ఔరా అనిపించి 2025 బెస్ట్ కన్నడ మూవీగా నిలిచింది.
