Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లోనే అత్యంత నిరాడంబ‌ర‌మైన పెళ్లి!

టాలీవుడ్ లో నటుడిగా ఇప్పటికే తన సత్తా చాటిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   27 March 2026 11:21 AM IST
టాలీవుడ్‌లోనే అత్యంత నిరాడంబ‌ర‌మైన పెళ్లి!
X

టాలీవుడ్‌లో యువ హీరోల పెళ్లిళ్లు అంటే కోట్లు ఖర్చు చేసి డెస్ట్రినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాల్లోనో లేదా భారీ సెట్టింగుల మధ్యో జరగడం మనం చూస్తుంటాం. ఇటీవ‌ల దేవ‌ర‌కొండ‌, అల్లు శిరీష్ వివాహ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా భారీగా జ‌రిగాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంచుకున్న దారి ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆడంబరాలకు ఏమాత్రం తావు లేకుండా అత్యంత నిరాడంబరంగా దైవ సన్నిధానంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అత్యంత సింపుల్ పెళ్లి ఇదే కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు... బెల్లంకొండ శ్రీనివాస్ ఏప్రిల్ 29న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి కొండపై పెళ్లితో ఓ ఇంటివాడు కాబోన్నాడు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుంది. అయితే చిత్ర పరిశ్రమలోని మిత్రులు, సెలబ్రిటీల కోసం మే 1వ తేదీన హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ రిసెప్షన్ జ‌ర‌గ‌నుంది. తిరుపతిలో వివాహం అనంత‌రం.. హైదరాబాద్‌లో విందు కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఇక ఈ పెళ్లి వేడుకకు ఎవరెవరు హాజరవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా శ్రీనివాస్ గతంలో తన `లేడీ క్రష్` అని బహిరంగంగా ప్రకటించిన కాజల్ అగర్వాల్ ఈ వివాహానికి లేదా రిసెప్షన్‌కు వస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి కవచం, సీత వంటి సినిమాల్లో నటించారు. కాజల్‌తో తనకున్న స్నేహం దృష్ట్యా తప్పకుండా శ్రీ‌ను పెళ్లి వేడుకలో కనిపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాజ‌ల్‌తో పాటు సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు కూడా రిసెప్షన్‌లో మెరిసే అవకాశం ఉంది. వీరంతా శ్రీ‌నుతో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ లో నటుడిగా ఇప్పటికే తన సత్తా చాటిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే వృత్తిపరంగా కూడా అత‌డు మరింత పరిణతి చెందాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కేవలం మాస్ ఎలివేషన్లకే పరిమితం కాకుండా కథ, కథన బలం ఉన్న సినిమాలను ఎంచుకోవాలని సూచనలు అందుతున్నాయి. సరైన దర్శకుడిని, వైవిధ్యమైన స్క్రిప్టును ఎంపిక చేసుకుంటేనే ప్రస్తుతం ఉన్న పోటీలో ఎవ‌రైనా నిలదొక్కుకోగలరు.

మొత్తానికి బెల్లంకొండ వివాహం ఒక వైపు ఆధ్యాత్మికంగా.. మరోవైపు సినీ గ్లామర్‌తో కళకళలాడబోతోంది. పాత తరం నటుల్లాగా తిరుపతిలో పెళ్లి చేసుకోవడం ద్వారా శ్రీనివాస్ తన సంప్రదాయబద్ధమైన ఆలోచనా శైలిని చాటుకుంటున్నార‌నుకోవాలి. అయితే శ్రీ‌ను సినిమా సెట్ల కోస‌మే భారీగా ఖ‌ర్చు చేసే బెల్లంకొండ సురేష్ దానికి భిన్నంగా కుమారుని పెళ్లిని ఇంత సింపుల్ గా కానిచ్చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంతేకాదు.. ఈ వివాహ వేడుక తర్వాత శీనూ చేసే సినిమాల్లో కూడా అదే మార్పు కనిపిస్తుందేమో చూడాలి. పెళ్లి త‌ర్వాతా న‌టుడిగా అత‌డు మ‌రో స్థాయికి ఎద‌గాల‌ని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.