కావ్య రెడ్డితో తిరుమల సాక్షిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.
By: Madhu Reddy | 30 April 2026 10:39 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. తన ప్రేయసి కావ్యరెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.
ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి..
ఏప్రిల్ 29 2026న రాత్రి 11 గంటల సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల వివాహం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది . ఈ వివాహ వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.. నూతన జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
పర్పుల్ థీమ్ లో కొత్తజంట..
ఇక ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి..పర్పుల్ థీమ్ లో భాగంగా చాలా అందంగా పర్పుల్ కలర్ పట్టు చీరలో మహాలక్ష్మిలా ముస్తాబయి అందరినీ ఆకట్టుకుంది కావ్యారెడ్డి.. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఎల్లో కలర్ ధోతి షర్టు ధరించి పర్పుల్ కలర్ కండువాతో తన స్టైలిష్ ని ఫుల్ ఫిల్ చేశారు. జువెలరీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ఆకట్టుకోగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కావ్య రెడ్డిల కెరియర్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన తొలిసారి అల్లుడు శీను సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక చివరిగా భైరవం, కిష్కింధపురి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. టైసన్ నాయుడు, హైందవ చిత్రాలలో నటించనున్నారు. ఇక కావ్య రెడ్డి విషయానికి వస్తే ఈమె సినిమా రంగానికి చెందినవారు కాకపోయినా ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందినవారు.. ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ సింపుల్ గా పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతోనే సంతోషకరమైన ముగింపుకు చేరుకున్నారు.
ఘనంగా రిసెప్షన్..
ఇకపోతే మే ఒకటవ తేదీన హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా వధూవరులు ఇద్దరు కూడా ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మెరువనున్నట్లు సమాచారం.
