అలా చేయడం పొరపాటే.. చాలా నేర్చుకున్నా: బెల్లంకొండ
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 8 Sept 2025 8:15 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ జోనర్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా రానున్న ఆ మూవీ సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
కిష్కింధపురితో మంచి కమ్ బ్యాక్ ఇస్తాననే నమ్మకంతో ఉన్న ఆయన.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కిష్కింధపురి మూవీ విమర్శకులతోపాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సినిమాను నిజాయితీగా తీశామని తెలిపారు.
హర్రర్ అనుభవాన్ని భంగపరచకుండా కామెడీ అంశాలను చాలా జాగ్రత్తగా సమతుల్యం చేశామని చెప్పుకొచ్చారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ట్రైలర్ లోన విలన్ గుర్తింపును ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టామని తెలిపారు. అయితే మ్యూజిక్ కోసం మొదట ప్రముఖ అజనీష్ లోక్ నాథ్ ను సంప్రదించామని, కానీ అది కుదరలేదని చెప్పారు.
అజనీష్ బిజీ షెడ్యూల్ వల్ల ఇతర ఎంపికలు పరిశీలించామని తెలిపారు. అయితే తాను రీమేక్ లు చేయడం పొరపాటు అని బెల్లంకొండ అంగీకరించారు. ఛత్రపతి, భైరవం సినిమాలు అనుకున్నంతగా వర్కవుట్ కాలేదని ఒప్పుకున్నారు. ఆ సినిమాల నుంచి నేర్చుకున్న పాఠాలు గురించి ఆలోచించానని బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో తెలిపారు.
షూటింగ్ లు, ప్రమోషన్ల సమయంలో తన సహకారం లేదని ఇండస్ట్రీలో వస్తున్న రూమర్లను ప్రస్తావించారు. ఒకవేళ సహకారం లేకపోతే 65 పని దినాల్లో సినిమాను ఎలా పూర్తి చేస్తామని క్వశ్చన్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టుల మధ్య మారాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగాని, తాను ఎప్పుడూ షూటింగ్ పై ఫోకస్ పెడతానన్నారు.
ఇక కిష్కింధపురి విషయానికొస్తే.. కౌశిక్ పగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే బెల్లంకొండ, అనుపమ కాంబినేషన్ లో వచ్చిన రాక్షసుడు మూవీ మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కిష్కింధపురి ఎలా ఉంటుందో వేచి చూడాలి.
