ఆధ్యాత్మిక వివాహాలు: భవిష్యత్తు ట్రెండ్‌కు యువహీరో చూపిన దారి!
గతంలో లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ తన కుమారుడి వివాహాన్ని ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా జరిపించి వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 8 May 2026 3:00 PM ISTగతంలో లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ తన కుమారుడి వివాహాన్ని ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా జరిపించి వార్తల్లో నిలిచారు. పెళ్లి పేరుతో జరిగే అనవసర ఖర్చును వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ఆ ప్రయత్నం ఒక ఆదర్శ వివాహంగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వివాహ వేడుక విషయంలో తీసుకున్న నిర్ణయం మరోసారి సామాజిక చర్చకు దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను తన వివాహ వేదికగా ఎంచుకోవడం ద్వారా ఆయన సంప్రదాయానికి సింప్లిసిటీకి పెద్దపీట వేశారు.
ఏప్రిల్ 29న తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కావ్యా రెడ్డితో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.``ప్రతి అందమైన క్షణానికి మాటలు అవసరం లేదు... కొన్నింటిని నిశ్శబ్దంగా అనుభూతి చెందాలి`` అంటూ యువహీరో షేర్ చేసిన సందేశం నెటిజన్ల మనసు గెలుచుకుంది. నేటి తరం సెలబ్రిటీలు కోట్లు వెచ్చించి విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు మొగ్గు చూపుతున్న వేళ... తన చిరకాల కోరిక మేరకు పురాతన క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇలాంటి నిర్ణయాలు నేటి యువతపై సానుకూల ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా `మినిమలిజం` (సింప్లిసిటీ) అనే భావనకు ఆదరణ పెరుగుతోంది. కేవలం షో-ఆఫ్ కోసం కాకుండా.. ఆధ్యాత్మిక అనుభూతి కోసం పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వెండితెరపై కనిపించే హీరోలు తమ మూలాలను గౌరవిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంప్రదాయం అనేది వెనుకబాటుతనం కాదు... అదొక గౌరవం అనే స్పృహ యువతలో కలుగుతుంది. ఇది కేవలం ఒక సెలబ్రిటీ పెళ్లి మాత్రమే కాదు.. మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు సగర్వంగా చాటిచెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన అడుగు.
ఆధ్యాత్మిక వివాహాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విలాసవంతమైన వివాహాలను చూసి ప్రభావితమై.. తమ స్తోమతకు మించి అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట. ``ఖర్చు కంటే ఆచారం..బంధం ముఖ్యం`` అనే ఆలోచన సమాజంలో బలంగా నాటుకుంటుంది. దీనివల్ల వివాహ వ్యవస్థలో ఉండే అనవసర సామాజిక ఆడంబరాలు మెల్లగా మరుగున పడి వివాహం అనేది ఒక పవిత్రమైన బంధంగా మాత్రమే భావించే రోజులొస్తాయని భావిస్తున్నారు.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో సింపుల్ వెడ్డింగ్‌లకు ప్రాధాన్యతనివ్వడం ఆయా కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతీయ పర్యాటకానికి తోడ్పడుతూ.. పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి `స్పిరిచువల్ వెడ్డింగ్స్` భవిష్యత్తులో ఒక ప్రధాన ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది. ఆడంబరాల కంటే ఆధ్యాత్మిక అనుభూతికే పట్టం కట్టిన బెల్లంకొండ వివాహం నిజంగా అభినందనీయం. తనయుడి సినిమాల సెట్స్ కోసమే కోట్లకు కోట్లు వెచ్చించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ .. ఎంత ఖర్చు చేసి అయినా పెళ్లి కోసం డెస్టినేషన్ లొకేషన్లను, భారీతనం నిండిన వెన్యూలను లాక్ చేయగలరు. కానీ ఆయన సింపుల్ వెడ్డింగ్ కి అంగీకరించడం చూస్తుంటే శ్రీను నిర్ణయాన్ని ఎంతగా గౌరవించారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో కొందరు విద్యావంతులు, ధనవంతులు అప్పటికే నిర్మాణంలో ఉన్న గుడిలో పెళ్లి చేసుకుని ఆ గుడి నిర్మాణం పూర్తవ్వడానికి అవసరమయ్యే డబ్బును దేవస్థాన కమిటీకి అందించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోదగిన పరిణామం.
