బెల్లంకొండ 'కిష్కింధపురి'.. ఫస్ట్ డే కన్నా ఎక్కువగా..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటించిన కిష్కింధ పురి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Sept 2025 2:05 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటించిన కిష్కింధ పురి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హారర్ జోనర్ లో రూపొందిన ఆ సినిమా, సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది.
తొలి రోజు మంచి కలెక్షన్స్ సాధించిన కిష్కింధ పురి మూవీ.. రెండో రోజు దూకుడు పెంచింది. ఫస్ట్ డే కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. శనివారం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ రోజుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా అనేక కేంద్రాల్లో సినిమా హౌస్ ఫుల్స్ ను నమోదు చేసింది.
అయితే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో తొలి రోజుకు గాను 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. అదే శనివారం, 75 వేల టిక్కెట్లు అమ్ముడవ్వడం గమనార్హం. దీంతో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ రోజు ఆదివారం కావడంతో మరిన్ని వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో మూవీ బ్రేక్ ఈవెన్ కూడా సండే కంప్లీట్ అయిపోయేటట్లు కనిపిస్తోంది. నాన్- థియేట్రికల్ డీల్స్ బాగానే జరిగినట్లు టాక్ వినిపించింది. థియేట్రికల్ టార్గెట్ ఎక్కువేం కాదని ప్రచారం జరిగింది. ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునేందుకు సిద్ధమైందని సమాచారం. లాభాలు కూడా సాలిడ్ గానే రానున్నాయని టాక్.
అయితే బెల్లంకొండ మాస్ పుల్ యాక్షన్, ఆసక్తికరమైన కథాంశం, ఉన్నతమైన సాంకేతిక విలువలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. కిష్కింధ పురి విడుదలకు ముందు.. ఆ తర్వాత కూడా సాయి శ్రీనివాస్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా ప్రేక్షకులను రప్పిస్తున్నాయని చెప్పవచ్చు. మూవీని తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్ పతాకం మీద సాహు గారపాటి గ్రాండ్ గా చిత్రాన్ని రూపొందించారు. సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. మరి కిష్కింధ పురి మూవీని మీరు చూశారా? మీకెలా అనిపించింది?
