చదువు, మస్తీ కలగలిపి... స్టార్ హీరో కొత్త డిజిటల్ ప్రయత్నం!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అవతారంలో అడుగుపెట్టారు.
By: Srikanth Kontham | 11 Oct 2026 6:07 PM ISTబాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అవతారంలో అడుగుపెట్టారు. సాధారణంగా స్టార్ హీరోలు యూట్యూబ్ వేదికలను సినిమా ప్రమోషన్లకు, వ్యక్తిగత వ్లాగ్స్‌కు మాత్రమే పరిమితం చేస్తారు. కానీ భాయ్‌జాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా చిన్నారులలో విద్యాబుద్ధులు , నైతిక విలువలను పెంపొం దించేందుకు ప్రత్యేక డిజిటల్ పాఠశాలను ప్రారంభించి ఆశ్చర్యపరిచారు. ఈ కొత్త యూట్యూబ్ ఛానెల్ విశేషాలు .. టార్గెట్ ఆడియన్స్ గురించి సల్మాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ కొత్త యూట్యూబ్ ఛానెల్ ద్వారా సల్మాన్ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్‌ను అందించే వినూత్న ఉద్దేశంతో `బీయింగ్ సల్మాన్ ఖాన్` పేరుతో డిజిటల్ వేదికను ప్రారంభించారు. `మొదటి నుంచి ప్రారంభిద్దాం... ఇది నా అధికారిక యూట్యూబ్ ఛానెల్. ఇక్కడ మీకు ఏ నుంచి జెడ్ వరకు అన్నీ దొరుకుతాయి` అంటూ అభిమానులను ఆహ్వానించారు. ఈ ఛానెల్ ప్రారంభించిన నిమిషాల్లోనే పెద్ద ఎత్తున స్పందన లభించడం విశేషం.
అయితే ఈ ఛానెల్‌లో వస్తున్న కంటెంట్ పెద్దలకు కాకుండా చిన్న పిల్లల కోసం రూపొందించినట్లు సల్మాన్ స్పష్టం చేశారు. `నా యూట్యూబ్ ఛానెల్‌ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ కంటెంట్ ప్రస్తుతం మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇది మీ చిన్న పిల్లల కోసం అని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను` అంటూ పోస్ట్ రాశారు.
పిల్లల పెంపకంలో విద్య ఎంత ముఖ్యమో తనదైన శైలిలో వివరించారు. కొద్దిపాటి సరదా, ప్రేమ, కుటుంబ విలువలతో పాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరమని సల్మాన్ పేర్కొన్నారు. `కొద్దిగా మస్తీతో పాటు ప్రేమ, కుటుంబం , పిల్లలకు చదువు కూడా ముఖ్యం కదా?` అని అభిమానులను ప్రశ్నించారు.
ఈ ఛానెల్‌లో ఇప్పటివరకు విడుదల చేసిన వీడియోలలో సల్మాన్ ఖాన్ వినూత్న రీతిలో కనిపించారు. ఒక ఉపాధ్యాయుడిగా , విద్యార్థిగా తానే స్వయంగా ద్విపాత్రాభినయం చేస్తూ... పిల్లలకు శరీర భాగాలు, మంచి అలవాట్లు, మర్యాదలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మాతృభూమి` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రియాలిటీ షో `బిగ్ బాస్` హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
