ప్రేక్షకుడు సినిమా తప్పా.. నటుల వ్యక్తిగత కష్టాలను పట్టించుకోడా?
ఇక డైరెక్టర్ "యాక్షన్" అనగానే మనసులోని బాధను దాచుకుని, ముఖంపై నవ్వులు పులుముకుని క్యారెక్టర్‌లోకి వెళ్లిపోవడమే ఒక ఆర్టిస్ట్ ఎదుర్కొనే అసలైన సవాలు.
By: Madhu Reddy | 12 Sept 2026 8:15 AM ISTవెండితెరపై మనకిష్టమైన నటుడు నవ్వుతుంటే నవ్వుతాం, ఏడుస్తుంటే కంటతడి పెడతాం. రెండు మూడు గంటల పాటు వారి నటనను చూసి ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తాం. కానీ ఆ మెరుపుల వెనుక, కెమెరా వెనుక నటులు పడే వ్యక్తిగత వేదనలు, కష్టాలు ప్రేక్షకుడికి ఎంతవరకు తెలుస్తాయి? మనసులో కొండంత బాధ ఉన్నా, రోజంతా నిద్ర లేకపోయినా కెమెరా ఆన్ అవ్వగానే చిరునవ్వులు చిందించాల్సిందే. నటుల గ్లామరస్ ప్రపంచం వెనుక దాగున్న ఆ మానసిక సంఘర్షణ గురించి చూద్దాం.
కెమెరా రోలింగ్.. బాధలకు తాత్కాలిక బ్రేక్!:
ఒక నటుడి జీవితంలో అత్యంత కష్టమైన పని తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని వేరు చేయడం. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, తీవ్రమైన మనస్తాపంలో ఉన్నా లేదా వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు వేధిస్తున్నా సెట్స్‌లోకి అడుగుపెట్టగానే అవన్నీ మర్చిపోవాలి. ఇక డైరెక్టర్ "యాక్షన్" అనగానే మనసులోని బాధను దాచుకుని, ముఖంపై నవ్వులు పులుముకుని క్యారెక్టర్‌లోకి వెళ్లిపోవడమే ఒక ఆర్టిస్ట్ ఎదుర్కొనే అసలైన సవాలు.
స్క్రీన్ పై చూసేది నటన మాత్రమే! :
ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేది కేవలం రెండు గంటల వినోదం కోసం మాత్రమే. హీరో ఎంత బాగా నటించాడు, ఎమోషన్లు ఎంత బాగా పండించాడనేది తప్ప, ఆ సీన్ తీసేటప్పుడు ఆయన ఎంత బాధను మోస్తున్నాడనేది ఎవరూ పట్టించుకోరు. "మేము పడే వేదనలు తెరపై కనిపించవు, వాళ్లకు కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే" అని చాలామంది నటులు ఆవేదన వ్యక్తం చేయడానికి కారణం ఇదే. కొన్ని సార్లు కమిడియన్స్ కూడా తమ బాధను బయటకు చెప్పిన రోజులు వున్నాయి..మూవీ లో చూసినప్పుడు నవ్వు వస్తుంది ..అదే కమిడియన్ బాధల్లో వున్నప్పుడు కూడా చూసి నవ్వుతుంటే, వాళ్ళ మనసులోని బాధ ఇలానే బయటకు వస్తుంది.
అనుభవించే ఒత్తిడి, నిద్రలేని రాత్రులు :
ఒక సినిమా హిట్ అయితే వచ్చే విజయం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ విజయానికి ముందు పడే మానసిక ఒత్తిడి అంతకంటే దారుణంగా ఉంటుంది. కోట్లాది రూపాయల బడ్జెట్, వేలాది మంది అభిమానుల అంచనాలు, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం.. ఇవన్నీ హీరో భుజాలపైనే ఉంటాయి. ఇక షూటింగ్ సమయంలో ఫిజికల్ గా గాయపడినా, మానసికంగా కుంగిపోయినా సినిమా పూర్తి చేయడానికి నిద్రలేని రాత్రులు గడపాల్సిందే.
గ్లామర్ వెనుక దాగున్న చేదు నిజాలు:
మనం బయటి నుంచి చూసే రంగుల ప్రపంచం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భారీ పారితోషికాలు, లగ్జరీ కార్లు, వేలాది మంది జనం ఇచ్చే చప్పట్లు మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్ డమ్ వెనుక ప్రైవసీ లేని జీవితం, శారీరక క్షోభ, మానసిక ఆందోళనలు దాగి ఉంటాయి. ఇక సినిమా సక్సెస్ వెనుక ఒక నటుడు కార్చిన చెమట, మోసిన బాధలు చాలావరకూ వెలుగులోకి రావు. ప్రేక్షకులు కేవలం స్క్రీన్ మీది వినోదాన్ని మాత్రమే చూసినప్పటికీ, నటులు తమ వ్యక్తిగత కష్టాలను పక్కనపెట్టి మనల్ని అలరించడానికి పడే కష్టం నిజంగా అభినందనీయం.
