పుష్పలో బన్నీ.. కల్కిలో బిగ్ బి.. ధురంధర్ లో హాంటింగ్ ఘోస్ట్.. అందరి వెనుక ఆమే
ఎన్నో సినిమాలకు మేకప్ వేసిన ఆమెకు సరికొత్త ఇమేజ్ తో పాటు.. పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టింది మాత్రం ధురంధర్.
By: Garuda Media | 12 April 2026 12:01 PM ISTపుష్పలోని గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ లుక్.. కల్కి మూవీలో అమితాబ్ అశ్వత్థామ గెటమ్.. తాజాగా ధురంధర్ మూవీలో హాంటింగ్ ఘోస్ట్.. ఇలా హీరో ఎవరైనా.. పాత్రకు తగ్గట్లు.. సీన్ కోరుకున్నట్లుగా ఇట్టే వారి రూపురేఖల్నిమార్చేయటంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆమె చేతులు ఏం మాయ చేశావే అన్నట్లు.. ప్రోస్థటిక్ మేకప్ తో మొత్తంగా మార్చేస్తారు. ఆమె పనీతీరుకు నిదర్శనంగా.. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. మరింత ఆసక్తర అంశం ఏమంటే.. కొన్నేళ్ల క్రితం వరకు సాదాసీదా ఐటీ ఉద్యోగినిగా ఉండే ప్రీతిశీల్ సింగ్.. ఇప్పుడు సినిమా ఏదైనా.. పాత్రలకు తగ్గట్లు.. హీరోలకు తుదిరూపాన్ని ఇచ్చేసే విషయంలో ఆమెకు తిరుగు లేదన్న పేరును సొంతం చేసుకున్నారు.
తండ్రి ఇంజినీర్. ఆయన బాటలోనే నడవాలని ప్రీతిశీల్ భావించారు. అందుకు తగ్గట్లే ఐటీ రంగంలోకి అడుగు పెట్టారు ఢిల్లీలోని టీసీఎస్ లో ఐటీ ఉద్యోగిగా తన కెరీర్ షురూ చేశారు. జాబ్ లో భాగంగా మూడేళ్లు న్యూయార్క్ లో పని చేశారు. చేసేది ఐటీ జాబ్ అయినా.. మనసంతా మాత్రం సినిమాల మీదనే ఉండేది. ఆమె ఆలోచనల్లో పడేసేలా చేసింది మాత్రం కమల్ హాసన్ నటించిన భామనే సత్యాభావనే. అందులోఆయన వస్త్రధారణ ఆమెను అమితంగా ఆకట్టుకుంది.
సాదాసీదాగా కనిపించే మనిషిని గుర్తు పట్టలేనంతగా మార్చే ప్రోస్థటిక్ మేకప్ గురించి ఆమెకు ఆసక్తి పెరిగింది. అందుకే.. తాను చేస్తున్న ఐటీ జాబ్ కు గుడ్ బై చెప్పేవారు. తన దగ్గర ఉన్న డబ్బులతో లండన్ లోని ప్రోస్థటిక్ మేకప్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె ఆ కోర్సు చేసే నాటికి భారత్ లో ఆ రంగానికి పెద్ద గుర్తింపే లేదు. అయితే.. తాను నమ్ముకున్న కళ మీద ఆమెకు నమ్మకం ఎక్కువ. అందుకే కోటి ఆశలతో ముంబయికి వచ్చారు.
ఆమె కెరీర్ ఆరంభంలో క్రిష్ 3కు పని చేశారు. అయితే.. ఆమె పడే కష్టానికి ఫలితాన్ని ఇచ్చి.. కొత్త గుర్తింపునకు కారణమైంది మాత్రం నానక్ షా ఫకీర్. ఆ సినిమాకు ఆమెకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీలో రణ్ వీర్ సింగ్ ను అద్భుతమైన రాజసంతో తీర్చీదిద్దిన ఆమె.. పద్మావత్ లో భయంకరమైన అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ మాత్రమే కాదు.. అందుకు పూర్తి భిన్నంగా పుష్ప మూవీలో మాస్ రగ్గడ్ లుక్.. గంగూభాయి కథియావాడి మూవీలో అలియా భట్ కోరుకున్నట్లు.. ఇలా సినిమా ఏదైనా.. హీరో హీరోయిన్ల పాత్రకు తగ్గట్లు వారిని పూర్తగా మార్చేసి.. ఆయా పాత్రలకు తగ్గట్లు వారిని మార్చేయటంలో ప్రీతి సిద్ధహస్తురాలు.
ఎన్నో సినిమాలకు మేకప్ వేసిన ఆమెకు సరికొత్త ఇమేజ్ తో పాటు.. పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టింది మాత్రం ధురంధర్. అందులో పాత్రల ఆహార్యంలో ఆమె పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసినట్లుగా చెబుతారు. రణ్ వీర్ ను స్పై ఏజెంట్ గా చూపించే విషయంలో ఆమె తనదైన టాలెంట్ చూపారు. గూఢచారిగా చూపేందుకు గడ్డం.. హెయిర్ ను స్టయిలింగ్ చేయటం కోసం.. హెయిర్ పంచ్ టెక్నిక్ వాడారు. అంతే.. గడ్డం అతికించకుండా.. ప్రతి వెంట్రుకను సహజంగా కనిపించేలా అమర్చటం చూస్తే.. తెర మీద అదిరే లుక్ వెనుక ఇంత కష్టం ఉంటుందా? అనుకోకుండా ఉండలేం.
సినిమాల్లో పాత్రల ముఖంపై కనిపించే అలసట.. గాయాలను సహజంగా ఉంచేందుకు ప్రత్యేకమైన కెమికల్స్ వాడకుండా సురక్షితమైన ప్రోస్థటిక్ మిశ్రమాలను వాడటం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. త్రీడీ స్కానింగ్ ప్రింటింగ్ ద్వారా నటుల ముఖాల కొలతల్ని తీసుకొని.. వారికి ఏ మాత్రం అసౌకర్యాన్ని కలగకుండా ప్రోస్థటిక్ మాస్క్ లను తయారు చేయటంలో ఆమెకున్న టాలెంట్ తర్వాతి లెవల్ గా చెబుతుంటారు.
మేకప్ విషయంలో ఆమె చేసిన ప్రయోగాలు ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారాయి. సాధారణంగా ప్రోస్థటిక్ మేకప్ ను కేవలం హారర్ మూవీలకు మత్రమే వాడేవారు. ఆ తీరును ఆమె మార్చేశారు. ఓవైపు మూవీల్లోని కీలక పాత్రలకు మేకప్ ను సెట్ చేసే ఆమె.. విడిగా బిజినెస్ విమెన్ గా చెబుతారు. భర్తతో కలిసి ముంబయిలో డా మేకప్ ల్యాబ్ అనే స్టూడియోను నడపటమే కాదు.. ఆమె వద్దకు వచ్చే వారి అవసరాల్ని తీర్చేస్తుంటారు. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో ప్రోస్థటిక్స్ కోసం విదేశీ నిపుణుల వైపు చూసే పరిస్థితికి ఆమె తన టాలెంట్ తో పుల్ స్టాప్ పెట్టేశారు.
