మూవీ రివ్యూ : బ్యూటీ
‘లిటిల్ హార్ట్స్’ అనే టీనేజీ లవ్ స్టోరీ సంచలనం రేపుతున్న సమయంలోనే ఈ తరహా కథతో తెరకెక్కిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Prakash Chimmala | 19 Sept 2025 1:51 PM IST‘బ్యూటీ’ మూవీ రివ్యూ
నటీనటులు: నీలాఖి పాత్ర- అంకిత్ కోయ- నరేష్- వాసుకి- నితిన్ ప్రసన్న- మురళీధర్ గౌడ్- ప్రసాద్ బెహరా తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగరహణం: శ్రీ సాయికుమార్ దార
నిర్మాతలు: అడిదల విజయ్ పాల్ రెడ్డి- ఉమేష్ కుమార్ బన్సాల్
కథ- స్క్రీన్ ప్లే: ఆర్వీ సుబ్రహ్మణ్యం
అడిషనల్ స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: జేఎస్ఎస్ వర్ధన్
‘లిటిల్ హార్ట్స్’ అనే టీనేజీ లవ్ స్టోరీ సంచలనం రేపుతున్న సమయంలోనే ఈ తరహా కథతో తెరకెక్కిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. బ్యూటీ. ఇప్పటికే క్యారెక్టర్ రోల్స్ లో ఆకట్టుకున్న అంకిత్ కోయ.. ఒడియా నటి నీలాక్షి పాత్ర జంటగా నటించిన ఈ చిత్రాన్ని జేఎస్ఎస్ వర్ధన్ రూపొందించాడు. దర్శకుడు మారుతి ప్రెజెంట్ చేసిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అలేఖ్య (నీలాఖి పాత్ర) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి నారాయణ (నరేష్) వైజాగ్ లో క్యాబ్ నడుపుతుంటాడు. కూతురిని ప్రాణంగా ప్రేమించే నారాయణ.. ఆమె అడిగిందీ ఏదీ కాదనడు. అంత గారాబంగా పెరిగిన అలేఖ్య.. ఇంటర్మీడియట్ చదుకుంటూనే అర్జున్ (అంకిత్ కోయ) అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. వీరి ప్రేమ విషయం అనుకోకుండా ఇంట్లో తెలిసిపోవడంతో ఇద్దరూ కలిసి లేచిపోవాలనుకుంటారు. మరి వారి ప్రణాళిక ఫలించిందా.. అర్జున్ తో కలిసి సాగించే ప్రయాణంలో అలేఖ్య ఎదుర్కొన్న కష్టాలేంటి.. ఇంతకీ వీరి పెళ్లి జరిగిందా.. కూతురి కోసం నారాయణ ఏం చేశాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
యువతను టార్గెట్ చేస్తూ.. వాళ్లలో భావోద్వేగాలు రేకెత్తించేలా టీనేజీ కథలను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించుకోవడం దశాబ్దాల నుంచి ఉన్నదే. సీనియర్ దర్శకుడు ‘చిత్రం’ అనే సినిమాతో ఈ ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ కోవలో తర్వాత ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక దశ దాటాక అవి మొహం మొత్తేసి ఆ జానర్ ఊపు కొంచెం తగ్గింది. కానీ గత కొన్నేళ్ల నుంచి మళ్లీ ఈ కథలకు ఊపు వస్తోంది. బేబీ.. కోర్ట్.. లిటిల్ హార్ట్స్ లాంటి టీనేజీ కథలను ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్ది విజయాలు అందుకున్నారు వాటి మేకర్స్. నిబ్బా-నిబ్బి కథలంటూ వీటి మీద సెటైర్లు వేసే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఈ సినిమాల్లో దేనికదే ప్రత్యేకంగా నిలిచేలా ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్ వాటిలో ఉన్న మాట వాస్తవం. ఆ ప్రత్యేకత లేకుండా ఇలాంటి కథలు నిలబడడం కష్టం. ఇప్పుడు టీనేజీ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘బ్యూటీ’లో కూడా ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది. యుక్త వయసులో వచ్చే ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడితే.. తల్లిదండ్రుల ప్రేమలోని ఔన్నత్యాన్ని గుర్తించకపోతే.. అమ్మాయి లేదా అబ్బాయి జీవితం ఎంతటి పతనాన్ని చవిచూస్తుందో ఈ సినిమాలో బలంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఐతే మంచి చెప్పాలంటే ముందు చెడు చూపించాలి కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ డోస్ కొంచెం ఎక్కువైపోవడంతో ప్రేక్షకులకు కొంచెం అసహనం తప్పదు. కానీ ‘బ్యూటీ’లోని షాక్ ఎలిమెంట్.. కూతురి కోసం తండ్రి పడే తపన.. ఉత్కంఠ రేకెత్తించే కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి.
చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోకుండా.. లోకం మరిచిపోయి తెర మీద అమ్మాయి-అబ్బాయి వేషాలేస్తుంటే.. కాస్త పరిణతి ఉన్న ఏ ప్రేక్షకుడికైనా కచ్చితంగా చికాకు పుడుతుంది. ‘బ్యూటీ’లో అమ్మాయి పాత్ర ఇలాగే ఉంటుంది. దాన్నొక ఇరిటేటింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కానీ ఆ అమ్మాయి పాత్ర అలా ఉండబట్టే ఇందులో తండ్రి పాత్ర బాగా హైలైట్ అయింది. ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ప్రేక్షకుడికి బలంగా తాకింది. మంచి విషయం చెప్పాలంటే ఈ చెడును చూపించక తప్పదు కాబట్టి ‘బ్యూటీ’లో కొన్ని సీన్లు అసహనం కలిగించినా తట్టుకోక తప్పదు. లోన్ మీద క్యాబ్ నడుపుకునే తండ్రిని గొంతెమ్మ కోర్కెలు కోరి ఇబ్బంది పెట్టడంతో మొదలుపెడితే.. ముందు వెనుక చూడకుండా ప్రేమించిన వాడితో లేచిపోయి తనతో కాపురం పెట్టే వరకు హీరోయిన్ క్యారెక్టర్ వ్యవహారమంతా ప్రేక్షకులను ఫ్రస్టేట్ చేస్తుంది. కానీ ఇలాంటి మెచ్యూరిటీ లేని టీనేజీ అమ్మాయి తప్పుదోవ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో బలంగా చూపించి మంచి సందేశమే ఇచ్చింది చిత్ర బృందం.
‘బ్యూటీ’లో ఆరంభ ఎపిసోడ్లు సాధారణంగా అనిపించినా.. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా మంచి టెంపోతో సాగుతుంది. కథలో వచ్చే మలుపులు తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధం కూడా మధ్యలో కొంచెం నెమ్మదించినట్లు కనిపించినా.. హీరోయిన్ పాత్రలోని అపరిపక్వత పతాక స్థాయికి చేరి అసహనం కలిగినా.. చివరి అరగంటలో మాత్రం ‘బ్యూటీ’ బలమైన ఇంపాక్ట్ వేస్తుంది. ప్రిక్లైమాక్సులో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్సు బాగానే పండింది. కూతురి కోసం ఓ తండ్రి పడే తపన కదిలిస్తుంది. ఆ ఎమోషన్ కు ఇటు యువత.. అటు తల్లిదండ్రులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. ప్రేమ మైకంలో హీరోయిన్ చేసే పనులు.. ఆ పాత్రను మరీ బోల్డ్ గా చూపించడం కుటుంబ ప్రేక్షకులకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కొంచెం డోస్ తగ్గించి ఉండాల్సింది. ఐతే యూత్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ‘బ్యూటీ’లో కొన్ని సమస్యలున్నప్పటికీ.. ఒకసారి చూడదగ్గ చిత్రమే.
నటీనటులు:
‘బ్యూటీ’లో ప్రధాన పాత్రధారులందరి పెర్ఫామెన్సులూ బాగున్నాయి. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయిన ఒడియా నటి నీలాఖి పాత్ర.. మెచ్యూరిటీ రాని టీనేజీ అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్రకు తగ్గట్లుగా బోల్డ్ గా కూడా కనిపించి మెప్పించింది. ఇప్పటిదాకా క్యారెక్టర్ రోల్స్ చేసిన అంకిత్ కోయ.. ఈసారి లీడ్ రోల్ లో రాణించాడు. పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ను బాగా చూపించాడు. క్లైమాక్సులో తన నటన హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ అదరగొట్టాడు. బయట ఒకలా కనిపించే నరేష్.. తెర మీద ఇలాంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయే తీరు గొప్పగా ఉంటుంది. ఆయనకు జోడీగా నటించిన వాసుకి కూడా తల్లి పాత్రలో చాలా బాగా చేసింది. నితిన్ ప్రసన్న.. మురళీధర్ గౌడ్.. ప్రసాద్ బెహరా.. వీళ్లంతా వారి వారి పాత్రల్లో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘బ్యూటీ’ ఓకే అనిపిస్తుంది. ‘బేబీ’ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ పాటల్లో ‘కన్నమ్మా..’ ప్రత్యేకంగా నిలుస్తుంది. మిగతా పాటలు అలా అలా సాగిపోయాయి. తన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీ సాయి కుమార్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఆర్వీ సుబ్రహ్మణ్యం రాసిన కథలో విషయం ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. దర్శకుడు జేఎస్ఎస్ వర్ధన్ కథకు కీలకమైన కొన్ని సన్నివేశాల్లో పనితనం చూపించాడు. కానీ ఓవరాల్ గా కథను నరేట్ చేసిన తీరు సోసోగా అనిపిస్తుంది. మెచ్యూర్డ్ ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారన్నది సందేహం.
చివరగా: బ్యూటీ.. యూత్ కోసం ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ
రేటింగ్ - 2.5/5
