బ్యూటీ మూవీ.. తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా టీమ్‌కి అండగా నిలిచారు.
By: M Prashanth | 14 Sept 2025 7:25 PM ISTసెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న బ్యూటీ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ పెరుగుతోంది. అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జె.ఎస్.ఎస్. వర్ధన్ డైరెక్ట్ చేశారు. విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జీ స్టూడియోస్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా టీమ్‌కి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, “బ్యూటీ ఒక గొప్ప సినిమా. తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా” అని పేర్కొనడం సినిమాకి మరింత బజ్ తెచ్చింది. ఆయన మాటల్లోనే ఈ కథలోని ఎమోషనల్ కంటెంట్ బలాన్ని ఊహించవచ్చు. నరేష్, వాసుకి, అంకిత్, నీలఖి అందరి నటన గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం టీమ్‌కి మోటివేషన్‌గా నిలిచింది.
ఇక ఈవెంట్‌లో అసలు ఫోకస్ సినిమా కంటెంట్‌పైనే పడింది. నిర్మాతలు, డైరెక్టర్, నటీనటులు అందరూ ఒకే మాట చెబుతున్నారు.. బ్యూటీ అనే పేరు ఎంత బ్యూటీఫుల్‌గా ఉందో, అంత బ్యూటీఫుల్‌గా సినిమా కూడా ఉంటుంది. కుటుంబ కథాంశంతో పాటు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే చిన్నచిన్న భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా చూపించారని చెప్పడం విశేషం. ప్రత్యేకంగా “పిల్లలు అడిగిందల్లా తల్లిదండ్రులు ఇవ్వలేని సమయంలో ఎదురయ్యే సంఘర్షణ” ఈ కథలో ప్రాధాన్యం పొందినట్టుగా తెలుస్తోంది.
హీరో అంకిత్ కొయ్య తనకు ఇచ్చిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపి, “ఆడియన్స్ నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి, నచ్చితే మాత్రం ప్రమోట్ చేయండి” అని స్పష్టంగా చెప్పాడు. ఇది ఆయన కాన్ఫిడెన్స్‌ని చూపిస్తూనే, సినిమా కంటెంట్ మీద టీమ్ నమ్మకాన్ని బలపరిచింది. హీరోయిన్ నీలఖి తన తొలి చిత్రంగా బ్యూటీలో అలేఖ్య పాత్ర చేయడం ఒక గర్వకారణమని పేర్కొంది. నరేష్, వాసుకి వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం కూడా సినిమాపై హైప్ ను పెంచింది.
డైరెక్టర్ వర్ధన్ ఈ సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ను హైలెట్ చేశారు. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది అని ఆయన చెప్పడం ఆడియన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి “మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడం కోసం పరిశ్రమలోకి వచ్చాను” అని చెప్పడం ఆయన దృఢనిశ్చయాన్ని చూపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు.
మొత్తానికి, సెప్టెంబర్ 19న రిలీజ్ కానున్న బ్యూటీ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే లిటిల్ హార్ట్స్, మిరాయ్ విజయవంతం కాగా, బ్యూటీ కూడా అదే పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తే బాక్సాఫీస్ దగ్గర బ్యూటీఫుల్ సక్సెస్ సాధించడం ఖాయం. తల్లిదండ్రులు, కుటుంబాల కోసం తప్పక చూడాల్సిన చిత్రం అన్న ట్యాగ్‌తో మేకర్స్ ఈ సినిమాను హైలెట్ చేస్తున్నారు.
