Begin typing your search above and press return to search.

గ‌ల్వాన్ స్టోరి: పుచ్చిపోయిన క‌ర్రతో బ్యాటిల్ న‌డిపిస్తాడా?

సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సికంద‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   29 Dec 2025 9:39 AM IST
గ‌ల్వాన్ స్టోరి: పుచ్చిపోయిన క‌ర్రతో బ్యాటిల్ న‌డిపిస్తాడా?
X

సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సికంద‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఏ.ఆర్.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం విఫ‌ల‌మ‌వ్వ‌డం నిజంగా అత‌డిని నిరాశ‌ప‌రిచింది. ఇప్పుడు ఆ నిరాశ నుంచి బ‌య‌ట‌ప‌డేసే భారీ హిట్టు కోసం స‌ల్మాన్ చాలా త‌పిస్తున్నాడు.

'బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్' చిత్రంతో అత‌డు గ్రేట్ కంబ్యాక్ ని ఆశిస్తున్నాడు. అయితే ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కానీ దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీజ‌ర్ అభిమానుల‌కు అంత‌గా న‌చ్చ‌లేదు. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా, ఇది సాహ‌సోపేత‌మైన ఇండో-చైనా బార్డర్ వార్ నేప‌థ్యంలో రూపొందుతోంది.

అయితే టీజ‌ర్ లో కంటెంట్ అభిమానుల‌ను అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. స‌ల్మాన్ ఒక నిరాయుధుడై శ‌త్రు సైన్యంపై పోరాడ‌టానికి సిద్ధ‌మ‌య్యే సీన్ ని చిత్ర‌బృందం టీజ‌ర్ లో చూపించింది. అయితే చైనాకు చెందిన సైన్యం ఆయుధాలు లేక‌పోయినా కానీ, ముష్ఠి యుద్ధానికి అన్ని ర‌కాల ర‌క్ష‌ణ‌ల‌తో దూసుకొస్తుంటే, స‌ల్మాన్ మాత్రం చాలా సింపుల్ గా ఒక పుచ్చిపోయిన క‌ర్ర ప‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. అత‌డు ప్ర‌తిఘ‌టించేందుకు సిద్ధంగా లేని వాడిగా క‌నిపించాడు. దీంతో అది స‌ల్మాన్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. యుద్ధ భూమిలో జ‌వాన్ మ‌రీ అంత ధీమాగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉండ‌దు. అందుకే స‌ల్మాన్ అప్పియరెన్స్ పై అభిమానులు ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఆయుధాలు లేదా రక్షణ సామగ్రి లేకుండా బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. వాస్త‌వ యుద్ధంలో సైనికులు రాళ్ళు, ర‌ప్ప‌లు, చెక్క దుంగలను ఉప‌యోగించిన మాట నిజ‌మే అయినా కానీ, భాయ్ యుద్ధానికి స‌న్న‌ద్ధ‌త లేనివాడిగా క‌నిపిస్తున్నాడ‌ని విమ‌ర్శలు ఎదురవుతున్నాయి. అక్రమ చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా వట్టి చేతులతో పోరాడిన గల్వాన్ సైనికుల ధైర్యాన్ని గౌరవించడం లక్ష్యంగా ఈ సినిమాని తీస్తున్నారు. కానీ ఇది వాస్త‌వాన్ని ప్ర‌తిబింబించేదిగా క‌నిపించ‌లేదు.

యుద్ధంలో సంయ‌మ‌నం స‌హించ‌లేనిది. చాలా దూకుడు అవ‌స‌రం. పైగా 60 ప్ల‌స్ ఏజ్ లో స‌ల్మాన్ ఖాన్ సైనికుడిగా న‌టించ‌డం పెద్ద స‌వాల్ లాంటిది అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చాలా మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ట్రోలింగ్ , మీమ్స్ తో చాలా మంది విరుచుకుప‌డుతున్నాడు.