Begin typing your search above and press return to search.

సెట్లు ప‌డ‌గొట్టి మంచు కొండ‌ల్లోకి స్టార్ హీరో జంప్

ఇటీవ‌ల మెహబూబ్ స్టూడియోస్‌లో సెట్లు వేసి చిత్రీక‌ర‌ణ‌ను సాగించారు. అయితే ఈ సెట్ల‌ను ఇప్పుడు ప‌డ‌గొట్టేస్తున్నార‌ని, ముంబై షూటింగ్ రద్దు కావడంతో సల్మాన్ ఖాన్ గాల్వాన్ వార్ షెడ్యూల్‌లో మార్పు వచ్చిందని చెబుతున్నారు.

By:  Sivaji Kontham   |   10 Aug 2025 6:00 AM IST
సెట్లు ప‌డ‌గొట్టి మంచు కొండ‌ల్లోకి స్టార్ హీరో జంప్
X

చైనా బార్డ‌ర్ గల్వాన్ లోయలో జరిగిన భారత్ - చైనా సైనిక ఘర్షణ నేప‌థ్యంలో నిజ కథ ఆధారంగా `బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్` చిత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో స‌ల్మాన్ చైనా బార్డ‌ర్ లో ప‌ని చేసే భార‌తీయ యుద్ధ వీరుడిగా న‌టిస్తున్నారు. గ‌ల్వాన్ ఘర్షణ సమయంలో తన దళాలను నడిపించిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నార‌ని సమాచారం. మరణానంతరం ఈ సైనిక‌ వీరుడు మహా వీర్ చక్ర అవార్డును అందుకున్నారు. ద‌ర్శ‌కుడు అపూర్వ ల‌ఖియా ఈ చిత్రాన్ని భారతదేశ సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా ఒక ర‌కంగా మ‌ల్ల యుద్ధాల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొంద‌నుంది. నిజానికి గాల్వాన్ లోయ‌లో సైనికులు ఎవ‌రూ నేరుగా ఆయుధాల‌ను ఉప‌యోగించ‌లేదు. గ‌న్ ఫైరింగ్ చేయ‌లేదు. అక్క‌డ బాహాబాహీకి దిగాల్సి వ‌చ్చింది. మార్గం మ‌ధ్య‌లో మంచు కొండ‌ల్లో దొరికిన క‌ర్ర‌లు, రాళ్ల‌ను దొర‌క‌బుచ్చుకుని వాటితో ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డ్డారు. బ‌లంగా కొట్టుకున్నారు. అలాగే పిడిగుద్దులు కురిపించ‌డం లేదా కుస్తీ ప‌ట్ల‌తో ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టి క‌రిపించ‌డం లాంటి స‌న్నివేశం అక్క‌డ క‌నిపించింది. అందుకే ఈ క‌థ‌పై స‌ల్మాన్ భాయ్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుకున్నాడు. సుల్తాన్ లాంటి సూట‌బుల్ క‌థ‌తో స‌ల్మాన్ చాలా మ్యాజిక్ చేసాడు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి ప‌ర్ఫెక్ట్ కథాంశం అత‌డిని చేరుకుంది. అందువ‌ల్ల బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ విజ‌యం పై స‌ల్మాన్ చాలా ధీమాగా ఉన్నాడ‌ట‌. అపూర్వ ల‌ఖియా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.

ఇటీవ‌ల మెహబూబ్ స్టూడియోస్‌లో సెట్లు వేసి చిత్రీక‌ర‌ణ‌ను సాగించారు. అయితే ఈ సెట్ల‌ను ఇప్పుడు ప‌డ‌గొట్టేస్తున్నార‌ని, ముంబై షూటింగ్ రద్దు కావడంతో సల్మాన్ ఖాన్ గాల్వాన్ వార్ షెడ్యూల్‌లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. షూట్ కి కొన‌సాగింపు షూట్ ని త‌దుప‌రి ఆగస్టు 22 - సెప్టెంబర్ 3 మధ్య లడఖ్‌లో పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. ఇది క్రియేటివిటీకి సంబంధించిన నిర్ణ‌యం. ఎక్కువ రోజులు గ్యాప్ అన్న‌దే లేకుండా వెంట‌నే పూర్తి చేయాల‌ని ల‌డాఖ్ లో 11రోజుల షూట్ ని ప్లాన్ చేసారు. ఇలా త‌క్కువ గ్యాప్ లో షూట్ చేయ‌డం వ‌ల్ల స‌ల్మాన్ ఖాన్ లుక్ మార‌దు. దానిని మెయింటెయిన్ చేయ‌డం క‌ష్టం కాదు. భార‌త సైనిక వీరుడి పాత్ర కోసం స‌ల్మాన్ ఒక ప్ర‌త్యేక‌మైన కొత్త రూపానికి మారాడు. అది ప్ర‌భావితం కాకుండానే తాజా షెడ్యూల్ ని ల‌డాఖ్‌లో పూర్తి చేస్తారు.

హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న లడాఖ్‌లోని కఠినమైన భూభాగాలపై పెద్ద ఎత్తున యుద్ధ సన్నివేశాన్ని ప్లాన్ చేశారని స‌మాచారం. దీనికి ముందే ముంబైలోని సెట్‌లను తీసేస్తున్నారు. షెడ్యూల్ డిలే కావ‌డంతో చిత్ర‌ బృందం బాంద్రా స్టూడియోలో నిర్మించిన భారీ సెట్‌లను కూల్చివేస్తున్నార‌ని స‌మాచారం.