ఫిలింక్రిటిక్స్‌కి సొంత ఇల్లు.. కొత్త అధ్యక్షుడు బత్తుల విజన్
హైదరాబాద్‌లోని కృష్ణానగర్ అంటేనే వేలమంది సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు.. అవకాశాల కోసం కలలతో ఎదురుచూసే కళాకారుల నిలయం.
By: Sivaji Kontham | 7 March 2026 5:33 PM ISTహైదరాబాద్‌లోని కృష్ణానగర్ అంటేనే వేలమంది సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు.. అవకాశాల కోసం కలలతో ఎదురుచూసే కళాకారుల నిలయం. అక్కడి గల్లీల్లో దాగి ఉన్న కన్నీళ్లను, తెర వెనుక విషాద గాథలను ప్రపంచానికి పరిచయం చేయడంలో సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ పాత్ర అద్వితీయం. తాజాగా ఆయన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం సినీ మీడియా రంగంలో ఒక కొత్త ఒరవడిగా జర్నలిస్టులు భావిస్తున్నారు.
సినిమా అంటే కేవలం వెండితెరపై కనిపించే గ్లామర్ మాత్రమే కాదని.. దాని వెనుక వేలాది మంది ఆకలి కేకలు ఉన్నాయని బత్తుల ప్రసాద్ తన ఇంటర్వ్యూల ద్వారా నిరూపించారు. దశాబ్దాల కాలం ఇండస్ట్రీకి సేవ చేసి, వృద్ధాప్యంలో ఒక్క పూట తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ కళాకారులను వెతికి పట్టుకుని వారి దీనస్థితిని సమాజం దృష్టికి తీసుకురావడం ఆయనకే చెల్లింది. గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణాలను ఆయన ఎంతో ధైర్యంగా ఆవిష్కరించారు.
ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొనే అవమానాలు, ఏజెంట్ల మోసాలు, పారితోషికం విషయంలో జరిగే అన్యాయాలను ఆయన తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నిలదీశారు. వేషాల కోసం వచ్చి మోసపోయిన యువతీ యువకుల ఆవేదనను, కిరాయి కట్టలేక ఫుట్‌పాత్‌ల మీద నిద్రించే కళారంగపు ఔత్సాహికుల కష్టాలను ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఇంటర్వ్యూలు కేవలం వీడియోలుగా మిగిలిపోకుండా బాధితుల జీవితాలను మార్చే లైఫ్ లైన్‌గా మారాయి.
బత్తుల ప్రసాద్ ఇంటర్వ్యూలలో ఉండే ప్రధాన ప్రత్యేకత సహానుభూతి (ఎంపథి). ఎదుటి వ్యక్తి తన బాధను చెప్పుకునేలా ఆయన ఎంతో సున్నితంగా ప్రశ్నలు అడుగుతూ ఒక ఆత్మీయ వాతావరణాన్ని కల్పిస్తారు. ఆయన చొరవ వల్లనే సీనియర్ నటి పావలా శ్యామల వంటి వారికి మెగాస్టార్ చిరంజీవి.. ఇతర ప్రముఖుల నుండి లక్షలాది రూపాయల ఆర్థిక సాయం అందింది. అలాగే మా(MAA) అసోసియేషన్ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన విజయం సాధించారు.
ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన మెరిసి, చివరి దశలో ఒంటరితనంతో కుమిలిపోయిన గీతాంజలి వంటి సీనియర్ ఆర్టిస్టుల కథలు, వయసు పైబడి పని లేక ఇండస్ట్రీ తమను మర్చిపోయిందని బాధపడే ఫైటర్లు, సైడ్ డాన్సర్ల ఆవేదన ఆయన వాయిస్ ద్వారానే లోకానికి తెలిసింది. గర్ల్స్ హాస్టల్స్ వద్ద ఉండే అమ్మాయిల భద్రత నుండి సినిమా రంగంలోని అంతర్గత సమస్యల వరకు ఆయన ప్రతి అంశాన్ని సామాజిక దృక్పథంతో విశ్లేషించారు.
ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడిగా బత్తుల ప్రసాద్ ఎన్నిక కావడం వల్ల భవిష్యత్తులో సినీ జర్నలిజం మరింత బాధ్యతాయుతంగా మారుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో నవతరం జర్నలిస్టులు కూడా కేవలం గాసిప్స్ వెనుక పడకుండా, సేవా దృక్పథంతో ఇబ్బందుల్లో ఉన్న కళాకారుల పక్షాన నిలబడాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. కృష్ణానగర్ కష్టాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో, అభాగ్యుల కష్టాలను బయటి ప్రపంచానికి ఆవిష్కరించడంలో ఆయన చేసిన ఈ ప్రయాణం సినీజర్నలిజంలో అత్యంత ప్రత్యేకమైనది.
దాదాపు ఐదు దశాబ్ధాలు పైబడిన చరిత్రతో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ టాలీవుడ్ లో అన్ని ఇతర అసోసియేషన్లకు సుపరిచితమైన సంఘం. ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడిగా బత్తుల ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఘంలోని జర్నలిస్టులకు కనీస గృహసదుపాయంపై దృష్టి సారించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రముఖ వెటరన్ సినీనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సహకారంతో హైదరాబాద్ నగర ఔటర్ లో నిర్మించతలపెట్టిన గృహసముదాయాలలో ఫిలింక్రిటిక్స్ కి సొంత గృహాల కలలను నెరవేర్చే హామీని ఆయన పొందారంటే, పరిశ్రమలో బత్తుల స్థిత ప్రజ్ఞత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
