టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్లు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ప్రభావం చూపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 21 May 2026 10:00 PM ISTమలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్లు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ప్రభావం చూపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ముఖ్యంగా కథలో కొత్తదనం, ఎమోషన్స్, వినూత్న మేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డైరెక్టర్లపై టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అధికారికంగా వెలుగులోకి రావడంతో సినీ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మిన్నల్ మురళి మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్, తన ప్రత్యేకమైన కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న కథను కూడా వినూత్న విజువల్ ట్రీట్‌మెంట్‌తో ఎలా భారీ స్థాయికి తీసుకెళ్లాలో ఆయన ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడదే డైరెక్టర్, అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రెట్టింపు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాసిల్, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ఆయన మాటల్లో కనిపించిన నమ్మకం చూస్తే ఈ కాంబో దాదాపు ఖాయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పూర్తిగా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోంది. పుష్ప సిరీస్‌తో ఆయనకు వచ్చిన గ్లోబల్ రీచ్ తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో డైరెక్టర్ల ఎంపిక విషయంలో కూడా బన్నీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాతో బిజీగా ఉన్న ఆయన, కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కాంబినేషన్‌పై సినీ విశ్లేషకుల్లో కూడా ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. కారణం బాసిల్ జోసెఫ్ స్టైల్ పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ గా ఉండటం. ఆయన సినిమాల్లో హ్యూమర్, ఎమోషన్, ఫాంటసీ ఎలిమెంట్స్ సహజంగా ఉంటాయి. మరోవైపు అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ అప్పీల్ ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్‌ను కలిగిస్తాయి. ఈ రెండు శైలులు కలిస్తే పూర్తిగా కొత్త తరహా సినిమా చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు టాలీవుడ్‌లో ప్రస్తుతం భాషల సరిహద్దులు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం పెద్ద విషయంగా భావించేవారు. కానీ ఇప్పుడు మలయాళం, తమిళం, కన్నడ పరిశ్రమల నుంచి వచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్లతో తెలుగు స్టార్ హీరోలు పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులు కూడా కొత్త కథలు, కొత్త మేకింగ్ స్టైల్స్‌ను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- బాసిల్ జోసెఫ్ కాంబో కూడా అదే ట్రెండ్‌ను మరింత బలపరచే అవకాశం కనిపిస్తోంది.
