Begin typing your search above and press return to search.

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

‘మిన్నల్ మురళి’ తర్వాత దాదాపు ఐదేళ్లుగా దర్శకుడిగా కొత్త సినిమా మొదలుపెట్టలేకపోయిన బాసిల్ జోసెఫ్.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో మూవీ కోసం ప్రయత్నిస్తున్నారు. బన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ప్రస్తుతం అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో బాసిల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

By:  M Prashanth   |   20 Nov 2026 10:37 AM IST
బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!
X

మలయాళంలో నటుడిగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న బాసిల్ జోసెఫ్‌కు దర్శకుడిగా మాత్రం టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. 'మిన్నల్ మురళి' వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతున్నా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లలేకపోయారు. మధ్యలో పెద్ద ప్రాజెక్టులు ప్లాన్ చేశారు. కథల కోసం చాలా సమయం కేటాయించారు. కానీ అవేవీ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మరో భారీ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈసారి కూడా బాసిల్‌కు ఎదురుచూపులు తప్పేలా కనిపించడం లేదు.

బాసిల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించింది మూడే సినిమాలకు. 2015లో కుంజిరామాయణం, 2017లో గోద, 2021లో 'మిన్నల్ మురళి'. ముఖ్యంగా 'మిన్నల్ మురళి' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో బాసిల్ నుంచి మరో సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకుడిగా గ్యాప్ పెరుగుతుంటే నటుడిగా మాత్రం బిజీ అయ్యారు.

నిజానికి బాసిల్ దర్శకత్వానికి దూరంగా ఉండాలని అనుకోలేదు. రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం వర్క్ చేసినా అవి ఆగిపోయాయని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా 'శక్తిమాన్' కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. రణ్‌వీర్ సింగ్‌తో ఆ సినిమా చేయాలనే ప్రయత్నాలు జరిగినా చివరకు కుదరలేదు. ఈ వ్యవహారాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అంత సమయం వెచ్చించిన తర్వాత సినిమా ఆగిపోవడం బాసిల్‌ను బాగా నిరాశపరిచింది.

మరోవైపు దర్శకత్వం కోసం నటుడిగా వర్క్ తగ్గించుకున్నారు. 2025లో ఇచ్చిన ఇంటర్వ్యూలో భారీ బడ్జెట్ సినిమా చేయాలంటే పూర్తి సమయం దానికే కేటాయించాలని చెప్పారు. కానీ ఇలాంటి సినిమాలకు మంచి కథ సిద్ధమైతే సరిపోదు. పెద్ద స్టార్ డేట్స్, నిర్మాతల ప్లానింగ్ కూడా కుదరాలి. బాసిల్‌కు గతంలో ఇక్కడే సమస్య ఎదురైంది. ఇప్పుడు అనుకుంటున్న ప్రాజెక్ట్ విషయంలోనూ స్టార్ హీరో డేట్స్ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

ఎందుకంటే బాసిల్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో సినిమా ఉంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులకే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు బాసిల్ సినిమా ఖరారైనా షూటింగ్ మొదలయ్యేందుకు మరికొంతకాలం పట్టొచ్చు. ఇప్పటికే ఐదేళ్ల గ్యాప్‌లో ఉన్న దర్శకుడికి ఇది చిన్న విషయం కాదు.

ఇక బన్నీతో సినిమా కోసం బాసిల్ టీమ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌లో ముంబైలో వీళ్ల సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాసిల్ రచయితలు, అసిస్టెంట్లు హైదరాబాద్‌కు వచ్చి కథపై సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అరుణ్ అనిరుధన్, పాల్సన్ స్కారియా రచనలో భాగమవుతున్నట్లు గతంలో సమాచారం వచ్చింది. అయితే సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా షూటింగ్ డేట్స్ ఎప్పటికి కుదురుతాయనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.