Begin typing your search above and press return to search.

ఇప్పుడు టెంపర్ వస్తే రూ.1000 కోట్లు సాధిస్తుందా? సాధ్యమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమాల్లో టెంపర్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది.

By:  M Prashanth   |   24 May 2026 8:26 PM IST
ఇప్పుడు టెంపర్ వస్తే రూ.1000 కోట్లు సాధిస్తుందా? సాధ్యమేనా?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమాల్లో టెంపర్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. 2015లో విడుదలైన ఆ సినిమా తారక్‌ లోని నటుడిని మరోస్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయం అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. తాజాగా నిర్మాత నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. ఇప్పుడు టెంపర్ తీస్తే రూ.1000 కోట్లు వచ్చేవంటూ ఆయన చేసిన కామెంట్స్ పై నెట్టింట చర్చ మొదలైంది.

నటుడు రాజా రవీంద్రతో బండ్ల గణేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాద్‌ షా తర్వాత తారక్‌ కు వరుసగా ఫ్లాపులు వచ్చాయని, రామయ్య వస్తావయ్యా, రభస ఆశించిన స్థాయిలో ఆడలేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో వక్కంతం వంశీ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, ఆ స్టోరీ దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లినట్లు చెప్పారు. కథ విన్న వెంటనే 'ఇది నీకు మరో 'గబ్బర్‌ సింగ్' అవుతుంది' అని పూరీ చెప్పారని బండ్ల గణేశ్ వెల్లడించారు.

అయితే అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే.. నిజంగానే ఇప్పుడు టెంపర్ విడుదలైతే రూ.1000 కోట్లు సాధించేదా? సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం దీనికి కచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే 2015లోని మార్కెట్ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అప్పట్లో పాన్ ఇండియా మార్కెట్ ఈ స్థాయిలో లేదు. ఓటీటీ ప్రభావం కూడా తక్కువే. టికెట్ ధరలు, థియేటర్ కలెక్షన్లు, ఓవర్సీస్ మార్కెట్, డిజిటల్ రైట్స్.. అన్నీ ఇప్పుడు భారీగా పెరిగాయి.

అదే సమయంలో ప్రస్తుతం తారక్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయనకు పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు వచ్చింది. హిందీ మార్కెట్‌ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే అభిమానులు ఇప్పటి తారక్‌ తో అదే స్థాయి కంటెంట్ వస్తే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే రూ.1000 కోట్లు అంటే మాత్రం చాలా పెద్ద టార్గెట్ అని మరికొందరు అంటున్నారు.

టెంపర్ కథ కూడా ప్రేక్షకులకు మంచిగా కనెక్ట్ అయింది. అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా జీవితంలో జరిగిన సంఘటనలు అతడిని ఎలా మార్చాయనే అంశాన్ని దర్శకుడు చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ కోర్టు సీన్‌ లో తారక్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సన్నివేశం ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులు గుర్తు చేసుకునే క్లాసిక్ మోమెంట్‌ గా నిలిచింది.

సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌ గా నటించగా, ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఎలివేషన్స్, తారక్ ఎనర్జీ కలిసి సినిమాను బ్లాక్‌ బస్టర్‌ గా నిలిపాయి. అప్పట్లో ఆ చిత్రం తారక్ కెరీర్‌ కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన వరుస విజయాలతో స్టార్ హీరోగా మరింత ఎదిగిపోయారు. ఏదేమైనా బండ్ల గణేష్ చేసిన రూ.1000 కోట్ల కామెంట్ కాస్త అతిశయోక్తిగా అనిపించినా.. టెంపర్ తారక్ కెరీర్‌ లో స్పెషల్ మూవీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.