Begin typing your search above and press return to search.

నీలాగా బాధ‌ప‌డితే నేను 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి: బండ్ల గ‌ణేష్‌

న‌టుడు- నిర్మాత బండ్ల గ‌ణేష్ జీవితానుభ‌వాలు, ఆక‌ట్టుకునే మాట‌లు ఎప్పుడూ ప్ర‌త్యేకమే.

By:  Sivaji Kontham   |   1 Oct 2026 9:36 AM IST
నీలాగా బాధ‌ప‌డితే నేను 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి: బండ్ల గ‌ణేష్‌
X

న‌టుడు- నిర్మాత బండ్ల గ‌ణేష్ జీవితానుభ‌వాలు, ఆక‌ట్టుకునే మాట‌లు ఎప్పుడూ ప్ర‌త్యేకమే. ఇటీవ‌ల ఓ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న క‌ష్టం వ‌చ్చిన ద‌ర్శ‌కుడిని స‌ముదాయిస్తూ మాట్లాడిన విష‌యాలు అంద‌రినీ ఆలోచింప‌జేసాయి. ఆ సినిమా ద‌ర్శ‌కుడు తాను జీవితంలో చాలా అవ‌మానాల్ని ఎదుర్కొన్నాన‌ని తెలిపాడు. దానికి బండ్ల స్పందిస్తూ.. నీలాగా బాధ‌ప‌డితే నేను 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి! అని వ్యాఖ్యానించారు. అయితే బండ్ల‌న్నకు అలాంటి అవ‌మానాలు ఏం ఎదుర‌య్యాయి? అన్న‌ది త‌ర‌చి చూస్తే.. చాలా చాలా.. ఎవ‌రూ ఊహించ‌న‌న్ని అవ‌మానాలు అతడి జీవితంలో ఉన్నాయి.

బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూ లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అత‌డి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు.. అవమానాలు.. ఒడుదొడుకులు అన్నీ ఇన్నీ కావు... ఆయ‌న మాట‌ల్లోనే వింటే...

``నా జీవితంలో నేను పడిన కష్టాలు, అవమానాలు చూస్తే.. మీలో ఎవరైనా సరే ఆ స్థాయిలో బాధపడితే ఇప్పటికి 500 సార్లు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చేది! ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో నేను పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎన్నో తిరస్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్లి కోడి గుడ్ల వ్యాపారం చేసుకో.. కోడి గిన్నెలు కడుక్కో`` అని చాలా మంది ముఖం మీదే హేళన చేశారు అని తెలిపారు.

పెళ్లయిన కొత్తలో నా భార్యతో కలిసి కారులో బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే.. ఫైనాన్స్ కట్టలేదని కారుని మధ్యలోనే సీజ్ చేసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న‌ ఇన్సల్ట్.. నా భార్య ముందు పడ్డ ఇబ్బంది నన్ను ఎంతో కుంగదీసింది. నా జీవితంలో ఒక పెద్ద మనిషి అయితే నన్ను ఏకంగా చెప్పుతో కొట్టాడు. ఆ రోజు ఆ అవమానం భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ ఆ కసితోనే నేను పట్టుదలతో పైకి వచ్చి.. ఆయనకంటే గొప్ప స్థానంలో నిలబడి నా సత్తా ఏంటో నిరూపించాను.

ఎవరి జీవితమూ పూలబాట కాదు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలకు అసలు తావివ్వకూడదు. ప్రతికూల పరిస్థితులే మనిషిని మరింత బలవంతుడిగా మారుస్తాయి. ప్రాణం విలువ ఏంటో తెలుసుకుని.. ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి! అని చెప్పారు.

ఎలాంటి సినీ నేప‌థ్యం లేక‌పోయినా..

టాలీవుడ్‌లో హాస్య నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండ్ల గణేష్, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. తన ప్రత్యేకమైన మేనిరిజంతో ప్రేక్షకులను నవ్విస్తూ కమెడియన్‌గా స్థిరపడ్డారు. క్రమంగా నటనపై ఉన్న పట్టుతో పాటు వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకున్న ఆయన ఇండస్ట్రీలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగారు.

ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా `తీన్ మార్`, `గబ్బర్ సింగ్` వంటి భారీ చిత్రాలను నిర్మించి అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగారు. అలాగే ఎన్టీఆర్ తో `బాద్‌షా` వంటి పెద్ద సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ బండ్ల అంటూ ఆప్యాయంగా పిలుప‌ను అందుకున్నారు. జీవితంలో ఎన్ని అవమానాలు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా... తన పట్టుదలతో నటుడిగా.. నిర్మాతగా ఆయన సాగించిన ప్రయాణం ఎంతో మందికి ఒక స్పూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుంది.