బండ్ల గణేష్ కు 'చెప్పు దెబ్బ'.. ఆ హీరో ఎవరు? అలా కరెక్టేనా?
తన మూవీ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఓ అవమానకర సంఘటనను తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు.
By: M Prashanth | 25 May 2026 10:07 AM ISTటాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తన మూవీ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఓ అవమానకర సంఘటనను తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. ఒక స్టార్ హీరో తనను చెప్పుతో కొట్టారని చెప్పిన గణేష్, అదే సంఘటన తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి.
నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో పాల్గొన్న బండ్ల గణేష్, గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజు ఆ ఘటన జరిగిందని చెప్పారు. ఆ రోజు ఒక ప్రముఖ హీరో పక్కన తాను కూర్చొని ఉన్నానని, తన అలవాటులో భాగంగా ఆయనను సార్.. సార్.. అని పిలిచానని తెలిపారు. అయితే ఆ హీరో ఏదో టెన్షన్‌లో ఉండి, చెప్పుతో తనను కొట్టాడని వెల్లడించారు.
'ఆ సమయంలో నా పక్కనే మరో హీరో కూడా ఉన్నారు. నేను చెప్పేది పూర్తిగా నిజం. ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా అవమానంగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి నేను బయటకొచ్చేశా' అని బండ్ల గణేష్ చెప్పారు. అయితే మరుసటి రోజు ఆ హీరో తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని, టెన్షన్ లో అలా జరిగిపోయిందని చెప్పారని వెల్లడించారు.
అయితే ఆ అవమానం తన జీవితాన్ని మార్చేసిందని బండ్ల గణేష్ భావోద్వేగంగా వివరించారు. 'ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టి అలా ప్రవర్తించారనిపించింది. కారు ఎక్కిన తర్వాత నా పక్కన ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అన్నాను. అదే నాకు జీవితంలో పెద్ద మోటివేషన్ అయింది' అని తెలిపారు.
తర్వాత నిర్మాతగా మారి పలువురు స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నానని చెప్పారు. అవమానాన్ని కసిగా మార్చుకుని ఎదిగానని పేర్కొన్నారు. అయితే తనను చెప్పుతో కొట్టిన హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ హీరో ఎవరన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పలువురు నెటిజన్లు తమ తమ అంచనాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎవరు అయినా సరే అలా ప్రవర్తించడం తప్పేనని వ్యాఖ్యానిస్తున్నారు.
కొందరు బండ్ల గణేష్ నిజాయితీగా తన అనుభవాన్ని పంచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తన స్పీచులు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన, ఈసారి చెప్పిన సంఘటనతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతుండగా, ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
