బండ్ల గణేష్ వ్యాపార సూత్రం: రవితేజకు క్షమాపణ వెనుక అసలు కథ
రవితేజకు సంబంధించిన ఒక భూమి విక్రయం విషయంలో జరిగిన సంఘటనను బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు.
By: Sivaji Kontham | 3 Sept 2026 8:00 AM ISTచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ ఇటీవల నటుడు రాజా రవీంద్రతో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో హీరో రవితేజకు క్షమాపణ చెప్పడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు. వ్యాపారపరమైన అంశాలు ఉన్నా.. వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక బంధం - ప్రేమే ఈ సారీకి ప్రధాన కారణమని ఆయన వివరించారు. సినీ రంగంలో స్నేహబంధాలు, వ్యాపార సంబంధాలు ఎలా ముడిపడి ఉంటాయో ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు.
రవితేజకు సంబంధించిన ఒక భూమి విక్రయం విషయంలో జరిగిన సంఘటనను బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు. నిజానికి ఆ ఆస్తిని అమ్మడం రవితేజకు ఎంతమాత్రం ఇష్టం లేదని.. అయినా ఆయనను ఒప్పించి ఆ భూమిని అమ్మేలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇది కేవలం ఒక వ్యాపారపరమైన నిర్ణయం మాత్రమేనని..అందులో ఎలాంటి మోసం గానీ... దురుద్దేశం గానీ లేవని స్పష్టం చేశారు. పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా తన వైఖరిని ఆయన పారదర్శకంగా వివరించారు.
సినిమా పరిశ్రమలో హీరోల స్థానాన్ని, వారి మానసిక స్థితిని విశ్లేషిస్తూ బండ్ల గణేష్ ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు. హీరోలు ఎప్పుడూ ఒక డ్యామ్ లాంటి వారని.. వారి బిజీ షెడ్యూల్స్ .. చుట్టూ ఉండే పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటేనే పరిశ్రమలో ఎవరైనా సంతోషంగా ఉండగలరని వ్యాఖ్యానించారు. అలాగే కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించి ముందుకు సాగడమే ఈ గ్లామర్ ప్రపంచంలో మనుగడ సాగించడానికి నిజమైన మార్గమని తనదైన శైలిలో పేర్కొన్నారు.
బండ్ల గణేష్‌కు ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులందరితోనూ అత్యంత ఆత్మీయ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ రాజా రవితేజ వంటి దిగ్గజ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి ఘన విజయాలను అందుకున్నారు. పరిశ్రమలో తిరుగులేని నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు.
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `గబ్బర్ సింగ్` వంటి పరిశ్రమ రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన తర్వాత ఆయనతో మరొక భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని బండ్ల గణేష్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం సఫలం కాకపోయినా పవన్ కళ్యాణ్ పై ఆయనకు ఉన్న అభిమానం, పరిశ్రమలోని ఇతర హీరోలతో ఉన్న అనుబంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం విశేషం.
